సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవి.. సీఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్
ప్రముఖ రచయిత్రి, పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మరణం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రచయిత్రి, పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మరణం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రముఖ రచయిత దివంగత బోయి భీమన్న కుమార్తె అయిన విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడమే కాక.. ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారు. సాహితీ రంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవి అని సీఎం కొనియాడారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. అని పోస్ట్ చేశారు. కాగా, ప్రముఖ రచయిత్రి బి విజయభారతి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంను విజయభారతి 1968లో వివాహం చేసుకున్నారు. బొజ్జా తారకం, విజయభారతి దంపతుల కుమారుడు రాహుల్ బొజ్జా.. ఆయన ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.