సీఎస్ సెలెక్షన్ వెనుక కేసీఆర్ సీక్రెట్ ఎజెండా!
సోమేశ్ కుమార్ బదిలీ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: సోమేశ్ కుమార్ బదిలీ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలా మంది ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా శాంతికుమారి పేరును సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. దీని వెనుక కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని టాక్. సీఎస్‌గా శాంతికుమారిని ఎంపిక చేయడం కూడా అందులో భాగమనే ప్రచారం జరుగుతున్నది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ సీరియస్‌గా వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఖాతా తెరవాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అదే సామాజిక వర్గానికి చెందిన శాంతికుమారికి ఏకంగా సీఎస్ పదవి కట్టబెట్టడంపై చర్చలు మొదలయ్యాయి. ఏపీలో కాపులకు దగ్గరయ్యేందుకే ఆ సామాజికవర్గానికి చెందిన శాంతి కుమారికి సీఎస్ పోస్టును కేసీఆర్ కట్టబెట్టారని టాక్.
తెలంగాణలో మొదటి మహిళా సీఎస్
తెలంగాణలో మొదటి మహిళా సీఎస్‌గా శాంతికుమార్ నిలిచారు. 2019 వరకు ఆమె సీఎంఓలో సెక్రటరీగా ఉంటూ హెల్త్, ఇండస్ట్రీస్ శాఖలను పర్యవేక్షించారు. టీఎస్ ఐ–పాస్ లో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆమెను సీఎంఓ నుంచి బదిలీ చేశారు. కొన్ని రోజులు హెల్త్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అటవీశాఖకు పరిమితం చేశారు. శాంతికుమారికి తెలియకుండానే ఆమె పరిధిలోని శాఖల రివ్యూలు కూడా చాలా సార్లు జరిగినట్టు ప్రచారం ఉంది. సీనియర్ గా ఉన్న ఆమెను అవమానపరుస్తున్నారని, కీలకమైన శాఖలు ఇవ్వలేదని అప్పట్లో సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరిగింది. తాజాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్.. శాంతికుమారికి సీఎస్ బాధ్యతలు అప్పగించి అక్కడి ఓట్లను బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా ఆమెకు సీఎస్ పోస్టు అప్పగించారు.
సీనియర్లు ఉన్నా..
శాంతికుమారి, సోమేశ్ కుమార్ ఇద్దరు 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లే. 2019 ఎస్కే జోషి రిటైర్ అయినప్పుడు శాంతికుమారిని కాదని, సోమేశ్‌ను సీఎస్‌గా నియమించారు సీఎం కేసీఆర్. అప్పుడే ఆమెను ఎందుకు సీఎస్‌గా నియమించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సీనియారిటీ ప్రకారం శాంతికుమారిని ఎంపిక చేశామని ప్రగతిభవన్ వర్గాలు వాదిస్తున్నాయి. మరి శాంతికుమారి కంటే సీనియర్‌గా ఉన్న తెలంగాణ కేడర్‌కు చెందిన రాణి కుముదిని ఎందుకు సీఎస్‌గా నియమించలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పిన కాపు నేతలు
శాంతికుమారిని సీఎస్ గా నియమించినందుకు ఏపీ నుంచి కాపు లీడర్లు బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ రామ్మోహన్ రావు(తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ అడ్వైజర్) బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఏపీ నాయకుడు పార్థసారథితోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. శాంతికుమారిని సీఎస్ నియమించడం వల్ల ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు కలిసివస్తుందనే విషయంపై వారు చర్చించినట్టు సమాచారం.