భారీ విగ్రహం రూపంలో ఒక బలమైన మెసేజ్ ఉంది: సీఎం కేసీఆర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ విశ్వమానవుడు అని కొనియాడారు. ఆయన సిద్ధాంతం సార్వజనీనమైనదని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఆశాదీపం అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని, జయంతులు జరుపుకోవడమే కాదని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అందుకే ఆయన పేరు సచివాలయానికి పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. పాటలు.. ఆటలు కాదని, ఆచరణాత్మక కార్యచరణ కావాలని ఆకాంక్షించారు. నగరంలో ఏర్పాటు చేసుకున్న ఈ భారీ మూర్తి రూపంలో ఒక బలమైన మెసేజ్ ఉందని అన్నారు. ఇది విగ్రహం కాదని, ఒక విప్లవం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. ప్రతీ ఏడాది సేవా కార్యక్రమాలు చేసిన వారికి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు అందజేస్తామని, అందుకు అంబేద్కర్ పేరుతో రూ.51 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో రాబోయేది మళ్లీ మన ప్రభుత్వమే అని, మరిన్నీ అద్భుతమైన కార్యక్రమాలతో దళితులను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో అంబేద్కర్ కలలుగన్న రాజ్యం రాలేదని, 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితులు పేదరికంలోనే ఉన్నారని ఆవేదన చెందారు. గత ప్రభుత్వాలు దళితుల అభివృద్ధిని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కార్యక్రమాలు వారికోసం చేపట్టినట్లు తెలిపారు. దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్‌కు దేశంలో ఊహించని రేంజ్‌లో ఆదరన వస్తోందని.. తెలంగాణ దళితబంధును దేశమంతా అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రతిఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అందిస్తామని హామీ ఇచ్చారు.
Read more:
అంబేద్కర్ పేరు మీద రూ.51 కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు.. సీఎం కేసీఆర్