తెలంగాణ తల్లి విగ్రహం లో మార్పులు.. ఈ విధంగానే ఉండబోతుందా..?
తెలంగాణ కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేయబోతున్నట్లు కేబినెట్ తెలిపింది. అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం తలపై కిరీటం, ఒక చేతిలో జొన్న మొక్క కంకులు పట్టుకుని మరో చేతిలో బతుకమ్మను పట్టుకుని ఉంటుంది. తెలంగాణాలోని హైదరాబాద్‌లో డిసెంబర్ 2017 లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు నివాళిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
అయితే విగ్రహం మార్పులు చేయాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీభవన్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో రూపొందించింది. కాంగ్రెస్ నెలకొల్పిన విగ్రహం చేతిలో చెరుకు గడ, మొక్కజొన్న కంకులు ఉన్నాయి. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో మన తెలంగాణ తల్లిని కొలుద్దామంటూ గతంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ మార్పులనే ప్రభుత్వం తెస్తుందా..? అనేది వేచి చూడాలి.