వార్డెన్లు ఖచ్చితంగా హాస్టల్‌లో ఉండాలి.. లేకపోతే చర్యలే: చంద్రయ్య
కంటోన్మెంట్ పరిధిలోని లాల్ బజార్, బోయిన్‌పల్లిలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలను బుధవారం రాత్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టీస్ చంద్రయ్య
దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: కంటోన్మెంట్ పరిధిలోని లాల్ బజార్, బోయిన్‌పల్లిలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలను బుధవారం రాత్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టీస్ చంద్రయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనం, మూత్రశాలలు, వంటగది, తాగునీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని వసతులను కల్పించాలని వసతి గృహాల ఇంఛార్జీలను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతి గృహాలలో లోపాలను సవరించడానికే అకస్మీక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్ల నిర్వాహణకు ప్రభుత్వమే కావలసిన నిధులను మంజూరు చేస్తుందన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలలో మెరుగైన వసతులకు, పరిశుభ్రతకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆహారం వండేటప్పుడు, పిల్లలకు వడ్డిస్తున్న సమయంలో వార్డెన్లు ఖచ్చితంగా హాస్టల్‌లో ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని, నిర్వాహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. వసతి గృహంతో పాటుగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తాను 4వ తరగతి నుంచే వసతి గృహాంలో చేరి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి గట్టు మల్లు, పీఆర్ఓ శ్రీనివాస్, ఎస్సై నాగేందర్ బాబు, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు సురేష్ కుమార్, దయాకర్ రావుతో పాటు ఆయా వసతి గృహాల ఇంచార్ట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.