తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. ఆ రోజే కీలక భేటీ
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నదా? ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న సైకిల్ పార్టీ తెలంగాణ గడ్డపై పూర్వ వైభవం వైపు అడుగులు వేయబోతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో పార్టీ అధికార పట్టాలెక్కడంతో ఇక తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేసే విధంగా పావులు కదపడానికి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చంద్రబాబు రాబోతున్నారు. ఈనెల 6వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యేందుకు హైదరాబాద్‌కు రాబోతున్న ఆయన 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు రావడం ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల్లో పోటీ!..
ఏపీలో కూటమిగా కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అయితే ఏపీ సాధించిన గెలుపు జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని పసుపు పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో తెలంగాణ టీడీపీకి నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థలల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ భద్రంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలుపులో టీడీపీ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. అధినేత కొంత సమయం కేటాయిస్తే తిరిగి పుంజుకోవడం సమస్య కాదనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలోనూ వ్యక్తం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలతోనే తిరిగి పోటీకి అంకురార్పణ చేయాలని టీటీడీపీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కూటమి ఇక్కడ రిపీట్?..
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ఇటీవల కొండగట్టు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో పొత్తు విషయాన్ని ప్రస్తావించటం చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే బీజేపీ, జనసేన తెలంగాణలో కలిసి పని చేస్తాయన్నారు. అయితే టీడీపీ విషయాన్ని పవన్ ప్రస్తావించకపోవడం సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నందువల్లే పొత్తుల విషయంలో టీడీపీ పేరును పవన్ ప్రస్తావించలేదని ఒక వేళ భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ పోటీకి సై అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే కూటమిగా ముందుకు వెళ్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిని రేపుతున్నది.