కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం కట్టారు: మంత్రి ఉత్తమ్ ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు ఇప్పటికే
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు ఇప్పటికే కుంగిపోయాయని.. ఆ బ్యారేజీ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత జరిగిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆరోపించారు. గోదావరిలో 2 టీఎంసీల నీటి కోసం లక్షల కోట్లు వృధా చేశారని నిప్పులు చెరిగారు.
కృష్ణ జలాల విషయంలో కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని.. కానీ అప్పటి సీఎం కేసీఆర్ ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదని ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా నీళ్లు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ కంటే 8 రెట్ల నీళ్లు ఆంధ్రకు వెళ్తే అప్పుడు కేసీఆర్ స్పందించలేదని ధ్వజమెత్తారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కృష్ణా ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.