Chamala Kiran: రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడారు.. హరీష్ రావుపై కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు

రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-08 12:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చామల కిరణ్ ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో మేడ్చల్ లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. 2014, 2018లో గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన విధి, విధానాలను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిందని స్పష్టం చేశారు.

రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండా రైతులను రెచ్చగొట్టేలా, ప్రజల్లోకి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లేలా హరీష్ రావు మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. మేడ్చల్ లో జరిగిన సురేందర్ రెడ్డి ఆత్మహత్య విషయంలో నిజానిజాలు దాచి పెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చనిపోయిన సురేందర్ రెడ్డి కుటుంబంలో వారి తల్లికి రూ.1లక్ష 50వేల రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ కానివారి వివరాలను సేకరించి వారికి రుణమాఫీ జరిగేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. కానీ, ఇక రుణమాఫీ జరగదు అనేలా హరీష్ రావు మాట్లాడిన తీరు.. రైతుల మనోస్థెర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యకు పురిగోల్పేలా ఉందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత(BNS) ప్రకారం నేరపూరిత కుట్ర 61(2), ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ 108 ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.





 


 



Similar News