Union Minister: అది హైడ్రా కాదు.. హైడ్రామా
హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది హైడ్రా కాదని.. ప్రభుత్వం చేస్తోన్న హైడ్రామా అని విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది హైడ్రా కాదని.. ప్రభుత్వం చేస్తోన్న హైడ్రామా అని విమర్శించారు. అప్పుడు అనుమతులు ఇచ్చింది అధికారులే.. ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నదీ అధికారులే అని మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా స్థలాలు కాపాడాలి కానీ కూల్చివేతలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. రియల్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంతో పాటు హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు వరకు.. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని కొంత భాగం ‘హైడ్రా’లో కలిసి ఉంటుంది. జీహెచ్ఎంసీ సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం. దాదాపు 2000 చ.కి.మీ పరిధిలో హైడ్రా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించి విస్తృతంగా కూల్చివేతలు చేపడుతోంది. దీనిపై రాజకీయ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.