నకిరేకల్, నాగార్జున సాగర్ హైవే కు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

నల్లగొండ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.

Update: 2024-10-15 07:29 GMT

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. జిల్లాలోని నకిరేకల్‌ - నాగార్జునసాగర్‌ మార్గంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు.. రూ.516 కోట్లతో కొత్త మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ రూట్ మ్యాప్ కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో 14 కి.మీ. మేర 4 వరుసల బైపాస్‌ రోడ్డు నిర్మించెందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌లో తెలుగు రాష్ట్రాల అనుసంధానానికి ఈ 565 జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు.

తెలంగాణలోని నకిరేకల్‌ కూడలి నుంచి మొదలయ్యే ఈ జాతీయ రహదారి నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నల్గొండ నుంచి సాగే సెక్షన్‌లో భారీగా వాహనాల రద్దీ ఉందని.. తాజాగా మంజూరుచేసిన బైపాస్‌ రోడ్డు నిర్మాణం వల్ల నల్గొండ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గుతుందన్నారు. అలాగే నకిరేకల్‌-సాగర్‌ మధ్య అనుసంధానం మెరుగవుతుందని.. సురక్షితమైన ప్రయాణానికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. కాగా ఈ రోడ్డు నిర్మాణం పై గత కొన్ని రోజులుగా నగర వాసులు ఆందోళన చేస్తున్నారు.


Similar News