సింగరేణి మూసివేతకు కేంద్ర ప్రభుత్వం కుట్ర: జనక్ ప్రసాద్

గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకుడు జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం

Update: 2024-06-29 17:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకుడు జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలనే విద్యుత్ సంస్థలు అప్పులపాలయ్యాయన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి మూసివేతకు కుట్ర పన్నుతుందన్నారు. కొంగు బంగారం లాంటి సింగరేణి సంస్థను కూడా కేంద్రం ప్రైవేటీకరణ పేరుతో నాశనం చేయాలని చూస్తుందన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో కలిసి సింగరేణిని నిట్టనిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు భవిష్యత్తు లేకుండా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రకు తెరలేపాయన్నారు. సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్ధకం మారిందన్నారు. సింగరేణి కంపెనీలో దాదాపు 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, 26 వేల మంది ఔట్ సోర్సింగ్, పరోక్షంగా 50 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు.

బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే సింగరేణికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. 2023– 24లో సింగరేణి కంపెనీ రికార్డు స్థాయిలో 70.02 మిలియన్లన్నుల బొగ్గును ఉత్పత్తిచేసిందన్నారు. మన రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఎన్టీపీసీ, కర్ణాటక, మహారాష్ట్రలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి బొగ్గును అందిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, వీటిలో 22 బొగ్గు గనులు 2032– 33 సంవత్సరానికి మూతపడుతాయన్నారు. ప్రతి అయిదేళ్లకు లెక్కలేసుకుంటూ పోతే బొగ్గు నిల్వలున్న ప్రాంతం గణనీయంగా తగ్గిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. ఇప్పుడు 70 మిలియన్‌ల బొగ్గుఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకు పడిపోతుందనే అంచనాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుత వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2031-32వ సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా, సింగరేణి కంపెనీ యాజమాన్యం కొత్త గనులు తీసుకోవాల్సిన అనివార్యత ఉన్నదన్నారు.ఈ పరిస్థితిలో కొత్త గనులను సింగరేణి కంపెనీకి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలనే సవరణను 24 ఫిబ్రవరి 2015లో పార్లమెంటులో ప్రవేశపెట్టారన్నారు. ఈ చట్ట సవరణ తర్వాత బొగ్గు గనులనుప్రైవేటుపరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, బీఆర్‌ఎస్ ఎంపీలంతా మద్ధతిచ్చారన్నారు. 135 ఏళ్లుగా ప్రభుత్వ భాగస్వామ్యంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణికి ఉరేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే, బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇవ్వడం ద్వారా కేసీఆర్ సింగరేణిని చంపేసే కుట్రలో పాలుపంచుకున్నారన్నారు.


Similar News