విచిత్ర పరిస్థితిలో రాష్ట్ర వైద్యశాఖ.. అయినా ప్రజల్లో మార్కులు కొట్టేసేందుకు సర్కార్ పాకులాట!

రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో కొత్త మెడికల్​కాలేజీల నిర్మాణాలకు కేంద్రం పైసలే దిక్కయ్యాయి.15వ ఆర్థిక సంఘం, నేషనల్ హెల్త్​మిషన్​నిధులతోనే వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి.

Update: 2023-02-21 02:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో కొత్త మెడికల్​కాలేజీల నిర్మాణాలకు కేంద్రం పైసలే దిక్కయ్యాయి.15వ ఆర్థిక సంఘం, నేషనల్ హెల్త్​మిషన్​నిధులతోనే వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆస్పత్రుల అప్​గ్రేడేషన్​పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వాడుతున్నట్టు సమాచారం. 2021లో మంజూరైన సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్​కర్నూల్, రామగుండం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 15వ ఫైనాన్స్, ఎన్​హెచ్ఎం నిధులనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. అయితే... వీటికి రాష్ట్ర బడ్జెట్​నుంచి కేవలం రూ.200 కోట్లలోపే ఖర్చు చేసినట్లు తెలిసింది.

ఇక 2022లో మంజూరైన నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్ మెడికల్​కాలేజీల ఏర్పాటుకూ కేంద్రం పైసలపైనే రాష్ట్రం ఆధారపడుతున్నదని సెక్రటేరియట్​లోని ఓ అధికారి తెలిపారు. కానీ.. కొత్త మెడికల్​కాలేజీల నిర్మాణానికి ప్రత్యేకంగా బడ్జెట్​లో ఖర్చు చేస్తున్నట్టు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎంతో సహా, బీఆర్ఎస్​నేతలు గొప్పలు చెప్పుకోవడం విశేషం. వైద్యశాఖలోని వివిధ కార్యక్రమాలన్నీ కేంద్రం నుంచి వచ్చిన డబ్బులనే వాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రచారం చేసుకోవడం గమనార్హం. ప్రజల్లో మెప్పు కోసమే రాష్ట్ర ప్రభుత్వం పాకులాడుతున్నదని ప్రతిపక్షాలు సైతం విమర్శలకు దిగాయి.

ఉన్న చోటనే ప్రపోజల్స్​పంపించారని..

మెడికల్​కాలేజీల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది తెలిసిందే. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​(సీఎస్‌ఎస్‌) కింద తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా విమర్శించారు. దానికి కౌంటర్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా కాలేజీలు ఉన్న చోటనే ప్రపోజల్స్​పంపించారంటూ సమాధానమిచ్చారు. అయితే.. ప్రభుత్వం ఆధీనంలోనివా.. ? ప్రైవేట్ మెడికల్​కాలేజీలా? అనేది దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలకు ప్రతిపాదనలు పంపితే మెడికల్​కాలేజీలు ఎందుకు ? మంజూరు చేయలేదని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాలకు కో నీతి.. తెలంగాణకు ఒక నీతా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా మెడికల్​కాలేజీ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది.

ఇది జరిగింది..?

2014 నుంచి దేశవ్యాప్తంగా సెంట్రల్ స్పాన్సర్డ్​స్కీమ్​కోటాలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మొదటి దశలో తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా రాలేదు. దీంతో తమకు కూడా కాలేజీలు ఇవ్వాలని 2015లో రాష్ట్రం ప్రపోజల్​పంపింది. దీనిపై అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. సీఎస్ఎస్​కింద తెలంగాణకు కాలేజీలు కేటాయించలేదని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ ద్వారా రిప్లై ఇచ్చారు. సీఎస్ఎస్​కోటాలో మెడికల్ కాలేజీలు రావాలంటే ఆయా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీలు ఉండకూడదనే రూల్ ఉన్నట్లు అందులో గుర్తు చేశారు. 2016 వరకు తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీలు ఉండేవి. అదే ఏడాది 21 కొత్త జిల్లాలను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సీఎస్ఎస్​కింద మెడికల్​కాలేజీలు ఇవ్వమని రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం చెబుతున్నది.

ఇక 2018 రెండో దశలోనూ రాష్ట్రానికి మెడికల్​కాలేజీలు మంజూరు కాలేదు. దీంతో మూడో దశలోనైనా తమకు సీఎస్ఎస్​కింద మెడికల్​కాలేజీలు ఇవ్వాలని అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కేంద్రానికి 8 ఆగస్టు 2019న లేఖ రాశారు. కరీంనగర్, ఖమ్మంకు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. అయితే మూడో దశలో ఏపీకి 3, కర్ణాటకకు 4, తమిళనాడుకు 11 మెడికల్​కాలేజీలను ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మళ్లీ మొండిచేయి చూపింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త మెడికల్​కాలేజీల పంచాయితీ మొదలైంది. ఇదిలా ఉండగా సీఎస్‌ఎస్‌ స్కీమ్​లో మెడికల్​ కాలేజీల ఏర్పాటుకు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తన వంతు వాటాగా 90 శాతం నిధులు ఇవ్వగా, మిగతా రాష్ట్రాలకు 60–40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నదని రాష్ట్ర వైద్యాధికారుల్లో ఒకరు తెలిపారు.

Tags:    

Similar News