నేడే విచారణ.. సీబీఐ టీమ్‌కు ఊహించని షాకిచ్చేందుకు సిద్ధమైన MLC కవిత?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు.

Update: 2022-12-06 02:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు. తొలుత ఇచ్చిన నోటీసు ప్రకారం డిసెంబర్​ 6న ఉదయం 11 గంటలకు కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నించాలనే షెడ్యూలు ఖరారైంది. ఆ రోజు అందుబాటులోనే ఉంటానని కవిత కూడా మూడు రోజుల క్రితం సీబీఐ ఇచ్చిన నోటీసుకు రిప్లయ్ లెటర్‌లో క్లారిటీ ఇచ్చారు. ప్రశ్నించడానికి ముందే తనకు ఎఫ్ఐఆర్ కాపీని, దానికి ముందు కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని అందజేయాలని సీబీఐని కోరారు. మెయిల్ ద్వారా ఆ రెండూ అందాయి. ఆ షెడ్యూలు ప్రకారమే ఢిల్లీ నుంచి నలుగురు అధికారులతో కూడిన సీబీఐ టీమ్ నగరానికి చేరుకున్నది. కానీ ఈలోపే ఎమ్మెల్సీ కవిత ట్విస్టు ఇచ్చారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ కాపీ, హోం శాఖ డైరెక్టర్ చేసిన ఫిర్యాదు ప్రతి తనకు అందాయని, అయితే వాటిలో తన పేరు లేదని సీబీఐ హెడ్ క్వార్టర్‌లోని ఏసీబీ డిపార్టుమెంట్ హెడ్ (డీఐజీ అధికారి) రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. నోటీసులో సీబీఐ పేర్కొన్నట్లుగా ముందుగా రూపొందిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 6న తాను నగరంలో ఉండడంలేదని, విచారణకు వచ్చే అధికారులను కలువలేనని, దానికి బదులుగా 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా రావచ్చని పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తికి సీబీఐ నుంచి సోమవారం రాత్రి వరకూ కవితకు రిప్లయ్ రాలేదు. ఆమె కూడా విచారణకు హాజరుకావడంపై డైలమాలోనే ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.

విచారణపై సర్వత్రా ఉత్కంఠ

లిక్కర్ స్కామ్‌లో ప్రమేయంపై ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు నగరానికి చేరుకున్నందున ఎమ్మెల్సీ కవిత ఇంటికి మంగళవారం ఉదయ వెళ్తారా? ఈ లోపే సీబీఐ హెడ్ క్వార్టర్ నుంచి వీరికి ఆదేశాలు అందుతాయా? విచారణకు వెళ్తే అక్కడ కవిత అందుబాటులో ఉంటారా? లేకపోతే సీబీఐ అధికారులు ఏం చేయనున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీబీఐకి ఇప్పటికే లేఖ రాసినందున తాను ముందుగా రూపొందించిన షెడ్యూలు ప్రకారం జగిత్యాలకు వెళ్లానని కవిత సేఫ్ జోన్ వెతుక్కుంటారా? లేక రిప్లయ్​ ఇవ్వకపోవడం సీబీఐ వైపు నుంచి జరిగిన పొరపాటు అని వ్యాఖ్యానించి విచారణకు గైర్హాజరవుతారా? అనే సస్పెన్స్ కొనసాగుతున్నది. కవితను ఏ కోణంలో ప్రశ్నించాలనే అంశంపై సీబీఐ హెడ్ క్వార్టర్‌లో ఇప్పటికే చర్చలు జరిగాయని.. హైదరాబాద్ చేరుకున్న నలుగురు అధికారులు తగిన ప్రశ్నలతో సిద్ధమయ్యారని సమాచారం. వీటికి తోడు కస్టడీలో పలువురు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, స్వాధీనం చేసుకున్న పత్రాల్లో బలం చేకూర్చే ఆధారాలు, ఫోన్ సంభాషణలు తదితరాలను కూడా వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తున్నది.

కవిత నివాసానికి వెళ్లడం ఖాయమేనా?

ఎమ్మెల్సీ కవిత లేఖపై సీబీఐ కార్యాలయం నుంచి సమాధానం రాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు అధికారులు షెడ్యూలు సమయానికి ఆమె నివాసానికి వెళ్లవచ్చనే వార్తలు జోనల్ కార్యాలయం నుంచి వినిపిస్తున్నాయి. ఆమె అందుబాటులో ఉండటంతోపాటు సమ్మతిస్తే ప్రశ్నిస్తారని.. లేకపోతే అక్కడ ఉన్నవారితో మాట్లాడి వారి వివరణను తీసుకుని అక్నాలెడ్జ్​మెంట్ (పత్రాలపై సంతకాలు) తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తదనంతరం కవిత సూచించిన నాలుగు తేదీల్లో ఒకదాన్ని ఫైనల్ చేసుకుని అప్పుడు ప్రశ్నించడానికి వస్తారని సూచనప్రాయంగా తెలిపాయి. ఏదైనా పరిస్థితుల్లో సీబీఐ నుంచి షెడ్యూలు టైమ్‌కంటే ముందే కవితకు మెయిల్ ద్వారా సమాచారం ఇస్తే దానికి అనుగుణంగానే సీబీఐ బృందం తిరుగుముఖం పడుతుందని పేర్కొన్నాయి.

కసరత్తుల తర్వాతే ప్లాన్ చేంజ్

సీబీఐ నుంచి నోటీసు అందిన వెంటనే కవిత స్పందిస్తూ.. కేవలం వివరణ కోసమే 160 సీఆర్‌పీసీ కింద నోటీసు వచ్చిందని వెల్లడించారు. తనను సాక్షిగా మాత్రమే విచారించనున్నారని.. పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఆ రోజు రాత్రే ప్రగతి భవన్ వెళ్లి సీఎంతో చర్చించారు. న్యాయ నిపుణులు, పోలీసు అధికారుల అభిప్రాయాన్నీ సీఎం తెలుసుకున్నారు. విచారణకు హాజరుకావడంపై లోతుగా చర్చలు జరిగాయి. ఆ మరుసటి రోజు ఉదయం కూడా తండ్రితో కవిత చర్చించారు. ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు కావాలనే లెటర్‌ను సీబీఐకి పంపారు. కానీ ఈ విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఎస్ కానీ, నో అని కానీ స్పందన రాలేదు. దీంతో నగరానికి వచ్చిన సీబీఐ అధికారులు మంగళవారం ఏం చేస్తారనే అంశంపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానున్నది.

ఇవి కూడా చదవండి : నగరంలో ఐటీ పంజా.. ప్రముఖ బిల్డర్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

Tags:    

Similar News