'దిశ' చెప్పిందే నిజమైంది.. గ్రానైట్ స్కాంపై రంగంలోకి సీబీఐ!

కరీంనగర్ గ్రానైట్ రవాణా వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఇక సీబీఐ రంగంలోకి దిగనుంది.

Update: 2023-01-06 05:43 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ గ్రానైట్ రవాణా వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఇక సీబీఐ రంగంలోకి దిగనుంది. కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రానైట్ క్వారీల నుండి రవాణా చేసిన బ్లాకులకు సంబంధించిన ట్యాక్స్ ఎగవేసి పోర్టుల ద్వారా విదేశాలకు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని ఈడీ సీబీఐకి లేఖ రాయడం గమనార్హం. కరీంనగర్ గ్రానైట్ స్కాంపై 'సీబీఐ' ఎంటర్ కానుందని గతంలోనే 'దిశ' వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ సీబీఐ లేఖ రాయడంతో సీబీఐ బృందాలు గ్రానైట్ వ్యవహారంపై సమగ్రంగా విచారించే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ సమీపంలోని 198 గ్రానైట్ రీచ్ హోల్డర్స్ నుండి శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్ కంపెనీ, జేఎం బాక్సీ, మైథిలీ ఆదిత్య, కేవీకే ఏజెన్సీస్, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీలు పోర్టుల వరకు రవాణా చేసిన గ్రానైట్ బ్లాకుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయిని సీనరేజ్ ఫీజు ఎగవేసి వీటిని విదేశాలకు తరలించారని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. రూ.124 కోట్ల మేర సీనరేజీ ఎగవేసిన నేపథ్యంలో పెనాల్టీతో సహా ఆయా ఏజెన్సీల నుండి నుండి రూ.749 కోట్ల మేర వసూలు చేయాలని ఈ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో అప్పడు రాష్ట్ర ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ వేసి తమకు మినహాయింపు ఇవ్వాలని గ్రానైట్ ఏజెన్సీలు వినతి పత్రం సమర్పించింది. అయితే వన్ ప్లస్ వన్ పెనాల్టీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసినప్పటికీ ఈ మేరకు కూడా డబ్బులు సదరు గ్రానైట్ ఏజెన్సీలు చెల్లించలేదు. దీంతో ఈ విషయంపై వైఎస్సార్సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ జీలు ఫిర్యాదులు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఈ ఫిర్యాదులో భాగంగా గత నవంబర్‌లో కరీంనగర్‌లోని పలు గ్రానైట్ ఏజెన్సీల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ సోదాలకు సంబంధించిన నివేదికలు తయారు చేసిన ఈడీ అధికారుల బృందాలు వివిధ కోణాల్లో ఆరా తీయాలని సీబీఐకి లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మరో గాలి అంశం..

15 ఏళ్ల క్రితం దేశ వ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసిన గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలాగానే కరీంనగర్ గ్రానైట్ స్కాం వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ ఎంట్రీ అయితే పలు కోణాల్లో ఆరా తీసినప్పుడు మరిన్ని అవకతవకలు వెలుగులోకి రానున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీబీఐ రంగంకి దిగినట్టయితే కేవలం సీనరేజ్ వ్యవహారమే కాకుండా పర్యావరణ నిభందనల మేరకు తవ్వకాలు జరిగాయా..? వే బిల్లుల రీ స్లైక్లింగ్ జరిగిందా..? సీఎస్ఆర్ నిధులు, నిబంధనల ప్రకారం నెలకు ఎంత మేర గ్రానైట్ వెలికి తీయాలి, బాధిత గ్రామాల్లో చేపట్టిన ప్రజాఆరోగ్య చర్యలు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీయనుంది. పలు కోణాల్లో ఆరా తీసి ఏఏ విధాలుగా గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఏపీ సీబీఐ విచారణ?

తెలంగాణాలో సీబీఐ విచారణ చేపట్టకుండా, సీబీఐ బృందాలు ఎంట్రీ ఇవ్వకుండా గత ఆగస్టులో జీఓ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ జీ ఫిర్యాదు తరువాత గ్రానైట్ బ్లాకులకు సంబంధించిన అక్రమాలు జరిగిన పోర్టుల వివరాలు సేకరించాలని విశాఖపట్నంలోని సీబీఐ అధికారులకు ఢిల్లీ నుండి ఆదేశాలు అందాయి. దీంతో విశాఖపట్నం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపేందుకు సీబీఐ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టేందుకు తెలంగాణాలోకి వచ్చేందుకు అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆంద్రప్రదేశ్ కు చెందిన సీబీఐ అధికారులు తెలంగాణలోని గ్రానైట్ లీజ్ హోల్డర్స్ కు సంబందించిన కేసును విచారించేందుకు ఇక్కడి అధికారుల సమన్వయంతో జరిపేందుకు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో కూడా చర్చించిన తరువాత సీబీఐ పూర్తి స్థాయిలో ఆరా తీసేందుకు కరీంనగర్‌కు రానున్నట్టు సమాచారం.


Similar News