Kavithaపై ఐదు గంటలుగా ప్రశ్నలవర్షం.. సాయంత్రం 6 గంటలకు CBI కీలక నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఐదు గంటలకు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఐదు గంటలకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిర్దిష్ట షెడ్యూలు ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఆమె నివాసంలోనే విచారిస్తున్న టీమ్.. రెండున్నర గంటల తర్వాత కొద్దిసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం విచారణను మళ్ళీ మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఆమెను ప్రశ్నించడం వీలుపడదు. అప్పటికల్లా విచారణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీబీఐ అధికారులు విచారణ అసంపూర్తిగానే ఉన్నదని భావిస్తే ఇరు పక్షాల మధ్యన ఏకాభిప్రాయం కుదిరిన మరో రోజున విచారణ కొనసాగాల్సి ఉంటుంది. లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోసియా, విజయ్ నాయర్, బోయిన్పల్లి అభిషేక్, దినేష్ అరోరా తదితరులను ఇప్పటికే ప్రశ్నించిన సీబీఐ ఇందులో కవిత ప్రమేయం ఉన్నట్లు భావించి వివరణ తీసుకోడానికి ఈ నెల మొదటివారంలో నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సీబీఐలోని డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం ఉదయం నుంచి కవితను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీలోని అవకతవకలు, అవినీతి, రూపకల్పనలో జోక్యం, ఢిల్లీలోని ప్రైవేటు హోటల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు తదితరాలన్నింటిపై సీబీఐ వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. పది వేల పేజీలతో ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్‌ను దాఖలు చేసినందువల్ల అందులోని అంశాలపై కూడా కవిత నుంచి వివరణ కోరడం ఈ విచారణలో భాగం. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత న్యాయవాది సమక్షంలో స్టేట్మెంట్ను సీబీఐ టీమ్ రికార్డు చేయనున్నది. ఆమె నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసు గదిలోనే విచారణ జరుగుతున్నట్లు ఆ ఇంటి సెక్యూరిటీ వర్గాల సమాచారం.