ఫామ్ హౌజ్ కేసులో సీబీఐ ఎంట్రీ! సర్కారులో టెన్షన్?
రాష్ట్ర సర్కారుకు సీబీఐ టెన్షన్ పట్టుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కారుకు సీబీఐ టెన్షన్ పట్టుకున్నది. ఫామ్ హౌజ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ అంశంలో ఏసీబీ, హైకోర్టుల్లో రాష్ట్ర సర్కారుకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టును ఆశ్రయించినా.. ఈ నెల 17న విచారణ జరిగేంత వరకూ ఎలాంటి స్టేటస్ కో ఉత్తర్వులను ఇవ్వలేమని క్లారిటీ ఇవ్వడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ఇప్పటికే కేసుకు సంబంధించి వివరాలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు అన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ విజ్ఞప్తి చేస్తూ నాలుగు లేఖలు రాసింది. తాజాగా హైకోర్టు ఆదేశాల తర్వాత ఐదో లేఖను రాసింది.
ఏ క్షణమైనా..
సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ దొరకకపోవడంతో ఏ క్షణమైనా సీబీఐ రంగంలోకి దిగి కేసును టేకప్ చేసే అవకాశమున్నది. ఇప్పటికే ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో టీమ్ కసరత్తు మొదలుపెట్టింది. కేసు మొత్తం సీబీఐకి బదిలీ అయిన తర్వాత దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే చర్చ జరుగుతున్నది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నుంచి మొదలవుతుందా.. లేక వీడియో, ఆడియో లీక్ అయిన దగ్గరి నుంచి మొదలవుతుందా.. లేక ఫిర్యాదు అందుకున్న తర్వాత రంగంలోకి దిగిన పోలీసుల యాక్షన్ నుంచి మొదలవుతుందా.. ఇలాంటి అంశాలపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. ఎవరెవరికి నోటీసులు ఇస్తారు అనేది దర్యాప్తు మొదలైన తర్వాతే క్లారిటీ రానున్నది.
స్టేట్ సహకరిస్తుందా?
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సీబీఐకి ఎలాంటి లీగల్ చిక్కులు లేకపోయినా స్టేట్ సహకారంపై అనుమానం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, డాక్యుమెంట్లను ఇవ్వడం లేదని సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ మొరపెట్టుకున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి స్పష్టమైన తీర్పు వెలువడిన తర్వాత కూడా ఇదే తరహా ఇబ్బంది ఎదురవుతున్నదని సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. అందుకే ఎఫ్ఐఆర్ నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఐదుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఫోకస్ దేనిపై?
ఈ కేసులో ముగ్గురు నిందితుల తరఫున హాజరైన న్యాయవాది హైకోర్టులో పలు అంశాలను లేవనెత్తారు. దర్యాప్తు ప్రారంభానికి ముందే ఆడియో, వీడియో ఫుటేజీ ముఖ్యమంత్రికి ఎలా చేరాయని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చేతికి ఎందుకు వెళ్లాయి.. ఇలాంటి అంశాలన్నీ కోర్టులో వాదనల సందర్భంగా న్యాయవాది లేవనెత్తారు. ఇప్పుడు సీబీఐ తన దర్యాప్తులో ఎక్కువగా ఈ అంశాలపైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలను విడివిడిగా ప్రశ్నిస్తే..
సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసి విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ ఆదేశిస్తే తదుపరి ఏం జరగనున్నదనే చర్చ చోటుచేసుకున్నది. నలుగురినీ విడివిడిగా ప్రశ్నిస్తే ఎక్కడ చిక్కుకుంటామో అనే ఆందోళన వారిలో లేకపోలేదు. ఎమ్మెల్యేలను కొనడానికి ముగ్గురు నిందితులను పంపింది బీజేపీ నాయకులేనంటూ ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
దర్యాప్తు ప్రారంభించేదెలా?
రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఇప్పటికే సీబీఐ హైకోర్టుకు చెప్పింది. అయితే తాజా పరిణామాలను మళ్లీ హైకోర్టులో ప్రస్తావించడమా.. లేక నేరుగా ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేయడమా అనే చర్చ జరుగుతున్నది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా డాక్యుమెంట్లు, వివరాలు లేకుండా దర్యాప్తు ప్రారంభించేదెలా అనే కన్‌ప్యూజన్ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఈ నెల 17న విచారణ జరిగేంత వరకూ ఎలాంటి స్టేటస్ కో ఉత్తర్వులను ఇవ్వలేమని క్లారిటీగా చెప్పినందున అప్పటిలోగానే ప్రాసెస్ మొదలుపెట్టాలనుకుంటున్నది. రానున్న రెండు రోజుల్లో సీబీఐ కదలికలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో కరెంటు గుబులు