అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం: కేటీఆర్

పేదలకు, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమై లోతుగా చర్చించింది.

Update: 2023-02-27 16:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలకు, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమై లోతుగా చర్చించింది. ప్రభుత్వం ఇప్పటికే జారీచేసిన జీవో 58, 59 అమలుపై సమగ్రంగా సమీక్షించింది. నోటరీ పత్రాలు, సాదా బై నామా భూముల విషయంలో ఎలా వ్యవహరించాలనేదానిపై అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నది. ఎండోమెంట్, వక్ఫ్ భూముల విషయంలో నిబంధనలను అమలుచేసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులపైనా చర్చించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ ఇండ్లను లేదా ఇంటి స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, సుమారు కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఈ సమావేశం ప్రారంభంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సందర్భంగా అప్పటి టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ప్రకారం 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1.25 లక్షల లబ్ధిదారులైన కుటుంబాలకు పట్టణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. జీవో 58 ప్రకారం 20,685 ఇండ్లకు ఇప్పటికే పరిశీలనా ప్రక్రియ ముగిసిందని, ఇక స్థలాలకు పట్టాలను పంపిణీ చేసే ప్రక్రియను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. బీపీఎల్ కుటుంబాలకు ఇంటి పట్టాలను మంజూరు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పేదలకు అనుకూలమైన విధానాన్ని అవలంబించడంతో పాటు అర్హత ఉన్న దరఖాస్తులకు సంబంధించిన కేసులను సత్వరం పూర్తి చేయాలని సూచించింది.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, మరికొద్దిమంది అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News