ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపు కేబినెట్ విస్తరణ?

మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చాన్స్ దక్కుతుందనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది.

Update: 2024-07-03 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చాన్స్ దక్కుతుందనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 5 తర్వాత అమావాస్య, ఆషాఢ మాసం వస్తుండటంతో గురువారమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జరుగుతున్నది.ఎవరికి చాన్స్ ఇవ్వాలనేది ఇప్పటికే ఫైనల్ అయినా ఏఐసీసీ నేతలు మరోసారి పరిశీలించి పేర్లను ప్రకటించే చాన్స్ ఉంది. అందుకే రాజ్‌భవన్ వేదికగా కొత్త మంత్రులతో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్‌లో 6 స్థానాలను భర్తీ చేసే అవకాశమున్నా..ప్రస్తుతం నలుగురికి చాన్స్ దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ఎవరికి ఈ చాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొనగా, కొందరు వారివారి ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఫైనల్ చేయనున్న ఏఐసీసీ..

ఢిల్లీ పర్యటన సందర్భంగా ఐదారు రోజుల పాటు సీఎం రేవంత్‌ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తదితరులంతా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు.పీసీసీ తరఫున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో జాబితాను సమర్పించినట్లు తెలిసింది.ఏఐసీసీ సైతం వీటిని పరిశీలించి ఫైనల్ చేయడం లాంఛనమేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.అయితే, కేబినెట్ విస్తరణపై అటు రాజ్‌భవన్ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది.

వరుస మీటింగులతో ఊహాగానాలు..

గవర్నర్‌, సీఎం మధ్య రెండున్నర గంటలపాటు లంచ్ మీటింగ్‌ జరగడమే ఈ ఊహాగానాలకు తావిచ్చినట్లైంది.దీనికి కొనసాగింపుగా సీఎస్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలవడం,ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్,మండలి చైర్మన్,అసెంబ్లీ సెక్రెటరీ తదితరులంతా సమావేశం వెనక వేర్వేరు కారణాలున్నా కేబినెట్ విస్తరణ హడావిడిలో భాగమేననే చర్చలు మొదలయ్యాయి.కేబినెట్‌లో చోటు కోసం పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు.మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, ఒక మైనార్టీ నేతకు చోటు దక్కొచ్చనే టాక్ వినిపిస్తుంది.కానీ, అటు ఏఐసీసీ నేతల నుంచి స్పష్టత లేకపోవడంతో కేబినెట్ విస్తరణ ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధత నెలకొన్నది.సీఎం,డిప్యూటీ సీఎంలతో చర్చలు జరపాల్సి ఉన్నందున ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ నుంచి సమాచారం వచ్చినట్లు సమాచారం.

కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం..

కేబినెట్ విస్తరణ,రాష్ట్ర పీసీసీ చీఫ్ నియామకం ఒకేసారి జరగొచ్చని,పేర్లను ఏఐసీసీ ఖరారు చేస్తుందనే లీకులు కూడా వస్తున్నాయి. పీసీసీ చీఫ్ పోస్టు కోసం కూడా ఢిల్లీలో పలువురు సీనియర్లు ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు.కేబినెట్ విస్తరణ,పీసీసీ చీఫ్ నియామకం..ఈ రెండూ కొన్ని అంశాల్లో ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నందున రెండింటినీ ఏఐసీసీ ఒకేసారి కొలిక్కి తెస్తుందన్నది గాంధీభవన్ వర్గాల సమాచారం.

మర్యాదపూర్వక భేటీలని..

గవర్నర్‌తో జరిగిన భేటీ మర్యాద పూర్వకమేనని, బాధ్యతలు చేపట్టాక ఆయన్ను కలవలేదని, అందుకే కలిశామని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. సీఎస్ కొన్ని పరిపాలనాపరమైన పనుల నిమిత్తం వెళ్లి కలిశారని, 6 బిల్లులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించినట్లు సచివాలయ వర్గాల సమాచారం.రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మైనారిటీ కమిషన్ ఏర్పాటు, వైద్యారోగ్య శాఖ,జీఎస్టీ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులపై చర్చించినట్లు తెలిసింది.సీఎం,డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Similar News