బ్రేకింగ్: BSP స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష తలపెట్టిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2023-03-17 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష తలపెట్టిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో శుక్రవారం ఉదయం నుంచి ఆర్ఎస్పీ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరవధిక దీక్షకు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు పలువురు బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఎస్పీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన ఆర్ఎస్పీ.. 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని తమ పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా చేస్తున్న దీక్షను సీఎం కేసీఆర్ తన పోలీసుల ద్వారా భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నిరవధిక దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్-1తో పాటు ఏయే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయో ఆ పరీక్షలను రద్దు చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ మీద అభ్యర్థులకు విశ్వాసం పోయిందని వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ను అంతా పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. అప్పటి వరకు తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు.

Tags:    

Similar News