BRS టు టీఆర్ఎస్.. పార్టీ పేరుపై KCR బ్యాక్ స్టెప్!
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. రెండు దఫాలుగా ప్రజలు అధికారం అప్పగిస్తే ప్రజల నాడికి భిన్నంగా పని చేశామని తాజాగా గులాబీ నేతలు రియలైజ్ అవుతున్నారు. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని కేటీఆర్ వంటి నేతలు చెబుతుంటే పార్టీ క్యాడర్ నుంచి మాత్రం బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడం పార్టీలో ఆసక్తికరంగా మారుతున్నది.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్‌కు పార్టీ నేమ్ చేంజ్ తన కెరీర్‌లోనే పెద్ద డ్యామేజీగా మారింది. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గాల సన్నద్ధత సమీక్షలో తెలంగాణ గళం, బలం దళం బీఆర్ఎస్ మాత్రమే అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా పోవడంతో ఆ సెంటిమెంట్ పండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో ఇక తిరిగి నిలబడాలంటే పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనలు గులాబీ నేతలే తాజాగా ప్రతిపాదిస్తున్నారు. జిల్లా స్థాయి నాయకులే కాదు సీనియర్ నేతగా ఉన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి వారు సైతం తాజాగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అధినేత ఆదేశాలు లేనిదే ఎలాంటి ప్రతిపాదనలు పుట్టని గులాబీ పార్టీలో ఈ కొత్త డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
తెర వెనుక కేసీఆర్ ప్లాన్?
టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు భావించారు. అందుకే రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు ఆ సెంటిమెంట్‌ను చేజేతులా కాలరాశారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోతే ఇక స్టేట్ పొలిటికల్ సినారియో అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీకి సంజీవని లాంటి తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలనే అభిప్రాయానికి అధినేత కేసీఆర్ వచ్చారనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ విషయం నేరుగా తానే ప్రస్తావిస్తే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని గ్రహించిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా పార్టీలోని ముఖ్యనేతల ద్వారా లీకులు ఇప్పిస్తూ పార్టీ పేరును తిరిగి మార్చుకునేలా పరిస్థితులు కల్పిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ తన ఆలోచనలను అమలు చేయాలనుకుంటే నేరుగా కాకుండా తొలుత అందుకు తగిన పరిస్థితిని క్రియేట్ చేసి ఆ తర్వాత పార్టీ మొత్తం ఆమోదంతోనే ఈ నిర్ణయం జరిగిందనేలా చేయడంలో కేసీఆర్ నేర్పరి అని ఈసారి కూడా అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.
నాట్ ఇమ్మిడియేట్లీ బట్ డెఫినెట్లీ
నేషనల్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ వేసిన తొలి అడుగు బెడిసికొట్టింది. సొంత గడ్డపైనే ఎదురుదెబ్బ తగలడంతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ పాగా వేయాలనే ఆలోచనకు అనేక సందేహాలు సంశయాలు మొదలయ్యాయి. దీంతో రచ్చ గెలవాలంటే మొదట ఇంట గెలవాలన్న సూత్రాన్ని పాటించాల్సిందేనని ఇది జరగాలంటే ప్రజలకు దూరమైన తెలంగాణ పదాన్ని తిరిగి పార్టీ పేరులో ఉండాల్సిందే అనే ఆలోచనకు కేసీఆర్ వచ్చారని ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పని చేస్తారనే వాదనలు వినిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి.