BRS పార్టీ గుర్తింపును రద్దు చేయాలి: రఘునందన్ రావు సంచలన డిమాండ్
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ సంచలన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ సంచలన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఇష్టారీతిన డబ్బు పంచిందని, దీనికి సంబంధించిన ఆధారాలు, అకౌంట్ వివరాలు ఈసీకి ఇచ్చామని తెలిపారు.
దీనిపై విచారణ జరిపి ఆ పార్టీపై యాక్షన్ తీసుకోవాలని కోరామని చెప్పారు. రాష్ట్ర సీఈవో కార్యాలయం స్పందించకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ తరుఫున ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగగా.. మే 27న ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. జూన్ 5న ఫలితం రానుంది.