ఇకపై ఫాం హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ.. అధినేత డైరెక్షన్‌లోనే అన్ని కార్యక్రమాలు

ఇక ఫాం హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఇవ్వనుంది. పార్టీ అధినేత డైరెక్షన్‌లోనే అన్ని పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Update: 2024-11-18 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇక ఫాం హౌస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఇవ్వనుంది. పార్టీ అధినేత డైరెక్షన్‌లోనే అన్ని పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతీది ముందస్తుగా ప్లాన్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీకి మైలేజ్ వచ్చేలా ఉండాలని తొందరపాటు నిర్ణయాలు నేతలు తీసుకోకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. స్థానిక నేతల అభిప్రాయం, ప్రజల మూడ్‌ను బట్టి ముందుకు వెళ్లాలని అప్పుడే సక్సెస్ అవుతామని అధినేత భావిస్తున్నారు. కొంతమంది లీడర్లు తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయని కేసీఆర్ దృష్టికి వెళ్లడంతోనే స్ట్రాటజీ చేంజ్ చేసినట్టు సమాచారం.

అధినేత అనుమతితోనే పార్టీ కార్యక్రమాలు!

బీఆర్ఎస్ సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన కార్యక్రమాలే చేపట్టనున్నారు. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది నేతలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పార్టీ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. దాంతో కొంత పార్టీకి డ్యామేజ్‌తో పాటు పార్టీలోనూ నాయకత్వలోపం ఉందని ప్రచారం జరిగే అవకాశం ఉందని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ అధినేత కేసీఆర్ సూచనలతో ముందుకు సాగాలని, ఆయన అనుమతి ఉంటేనే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో ఫాం హౌస్‌లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించి పార్టీ పటిష్టతపై చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. అందులో భాగంగానే నేతలు పార్టీ సూచన మేరకు ముందుకుసాగాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని.. అందుకు తగిన ప్రణాళికలు సైతం రూపొందించినట్టు తెలిసింది. చేపట్టబోయే కార్యక్రమంలో అనుసరించాల్సిన విదివిధానాలను సైతం లీడర్లంతా భేటీ అయి అభిప్రాయాల మేరకు ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం.

బీఆర్ఎస్ వైపు చూసే వరకు వేచిచూడాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేక స్టార్ట్ అయింది. రైతు రుణమాఫీ, రైతుభరోసా, విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి విషయాల్లో, లగచర్ల బాధితులు ఆందోళన బాట పట్టడంతో వారి పక్షాన పార్టీ నిలబడుతోంది. అయితే, ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత రాగానే హడావిడి చేయొద్దని, పూర్తిగా వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైపు చూసేవరకు వేచి చూడాలని ఇప్పటికే నేతలకు కేసీఆర్ సూచన చేశారు. రాష్ట్ర పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా నేతలకు సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. లగచర్ల బాధితుల పక్షాన ఉండాలని అధినేత సూచనల మేరకే పార్టీ లీడర్లు ముందుకు సాగుతూ వారికి భరోసా కల్పిస్తున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా అది పార్టీకి మైలేజ్ పెంచాలని, ఇతర పార్టీలకు కలిసొచ్చేలా ఉండకుండా వ్యూహాలను రచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఒక్కో అంశంపై ఒక్కో ప్రోగ్రాం‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి సందర్భానుసారంగా తీసుకొని వెళ్లాలని భావిస్తున్నట్టు నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింత స్పీడ్ పెంచాలని, ప్రజల్లో నిలదీయాలని భావిస్తున్నట్టు సమాచారం.

కేడర్‌లో ఉత్తేజం నింపేలా ప్రణాళికలు

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు కొన్ని బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఏ అంశంతో ముందుకు వెళ్దామనుకున్న సక్సెస్ కావడం లేదని పార్టీ నేతల్లో అభిప్రాయం ఉంది. అమృత్ స్కీంలో స్కాం ఆరోపణలు.. మూసీ లూటిఫికేషన్ కామెంట్.. హైడ్రా విషయంలోనూ ఆర్డినెన్స్‌తో బ్రేక్.. నేవీ రాడార్ స్టేషన్‌లోనూ చేసిన వ్యాఖ్యలన్నీ రివర్స్ అయ్యాయి. అన్నీ గత ప్రభుత్వ నిర్ణయాలేనని సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో పాటు సీఎం వేదికలపై స్పష్టంగా చెప్పడంతో కొంత డ్యామేజ్ అయినట్టు పార్టీ అధిష్టానం భావించినట్టు తెలిసింది. సర్కారును ఇరుకునబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ తుస్ మంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏదీ కలిసి రావడం లేదని పార్టీ లీడర్లలో చర్చనీయాంశమైంది.

దీంతో కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చి ఆయన సూచనల మేరకే ముందుకు సాగాలని నేతలకు సూచించినట్టు తెలిసింది. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం కేడర్‌లో ఉత్తేజం నింపేలా ఉండాలని, కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని భావిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు ఏ మేరకు నష్టం చేస్తుందనే అంశాలను లెక్కల వారీగా వివరించేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు రాజకీయంగా విమర్శలకు స్పీడ్ పెంచాలని, ఏ ప్రోగ్రాం చేపట్టినా కేసీఆర్ అనుమతితోనే సాగాలని సూచించినట్టు తెలిసింది. కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల నాడిని ఎప్పకటిప్పుడు తెలుసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పార్టీ నేతలు పేర్కొన్నారు. ‘స్థానిక’ ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందనేది గులాబీ కేడర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Similar News