మోడీకి ఇవే చివరి ఎన్నికలు.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మోడీకి ఇవే చివరి ఎన్నికలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : మోడీకి ఇవే చివరి ఎన్నికలు.. దేశంలో బీజేపీ మరో మారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోడీ పేర్కొనడం ప్రధాని హోదాకు తగదన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో కూరుకు పోయిన కర్నాటక బీజేపీ ప్రభుత్వం గురించి మోడీ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. బీజేపీ కి మోడీ కి అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభ పెట్టారని, ఆ సభను ప్రధాని పూర్తిగా రాజకీయ మయం చేశారని ఆరోపించారు. మోడీ సభ లో గతం లో చెప్పిందే చెప్పారని కొత్తగా చెప్పిందేమి లేదన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదు కనుక ఏం చెప్పలేక పోయారని మండిపడ్డారు. బీబీ నగర్ ఎయిమ్స్ ను ఈ రోజే పనులు మొదలు పెడుతున్నట్టు మోడీ నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.
ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే కేటాయించనట్టుగా, హైదరాబాద్ మెట్రో లో కేంద్రం ప్రమేయం లేకున్నా ఉన్నట్లుగా, ఔటర్ రింగ్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకున్నా కేంద్రానిదే అన్నట్టు మోడీ అబద్దామాడారన్నారు. జాతీయ రహదారులకు తొమ్మిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికే ప్రజలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు టోల్ రూపంలో రాష్ట్ర ప్రజలు చెల్లించారని, మోడీ చేసిందేమీ లేదన్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కేంద్రం ఈ తొమిదేళ్లలో కేటాయించలేదని, రాష్ట్రం రేషన్ కార్డులు దాచుకున్నట్టు మోడీ అబద్దామాడారని ఆరోపించారు. నగదు బదిలీ పథకం పై కూడా ప్రధాని అబద్దాలు ఆడారని, 65 లక్షల మంది రైతు కుటుంబాలకు 65 వేల కోట్ల రూపాయలు అకౌంట్లలో వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. 40 లక్షల మంది కి ఆసరా పెన్షన్లు నగదు బదిలీ పథకం కింద ఇస్తోంది మోడీ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
అదానీ కి రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా కట్టబెడతారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్ర లోన్ల పై మోడీ అబద్ధాలే మాట్లాడారరన్నారు. అన్నీ వ్యవస్థలను మోడీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు పార్లమెంటు లో మాట్లాడటానికి మోడీ అవకాశం ఇవ్వలేదని, సీబీఐ, ఈడీలపై కోర్టు కు వెళ్లాయన్నారు.ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ మోడీ ది పార్టీ సభనా, అధికారిక సభనా బీజేపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ఓ ప్రధాని లాగా కాకుండా గల్లీ నాయకుడిలా మాట్లాడారని, ఆయనకు తెలంగాణ కు అవార్డులు, రివార్డులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ దొడ్డిదారిన తెలంగాణ ను కబలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మోడీ సహకరించినట్టుగా ఉందని ఆరోపించారు. కేంద్రం సహకారం లేకున్నా రాష్ట్రం కేసీఆర్ విజన్ తో పురోగమిస్తోందని స్పష్టం చేశారు.