బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో కరెంటు గుబులు

వామ్మో కరెంట్ కోతలు.. ఇప్పుడే ఇలా ఉంటే మార్చి నెలలో పరిస్థితి ఏంటీ.. పొద్దున్నుంచి కరెంటు కోసం ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి.

Update: 2023-02-09 02:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వామ్మో కరెంట్ కోతలు.. ఇప్పుడే ఇలా ఉంటే మార్చి నెలలో పరిస్థితి ఏంటీ.. పొద్దున్నుంచి కరెంటు కోసం ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు..ఈ మాటలు విపక్షాలకు చెందిన లీడర్లవో, రైతు సంఘాలవో కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆవేదన. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటోన్న సందర్భాల్లో కరెంట్ కోతల సమస్య ప్రస్తావనకు వచ్చింది. సమస్యను పరిష్కరించకపోతే ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.

రైతులు ఓట్లేయరు

24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. గ్రామాల్లో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయని, ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని వాపోయ్యారు. ఇదే విషయాన్ని లాబీల్లో తమకు కనిపించిన ఓ సీనియర్ మంత్రి దృష్టికి ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు వివరించారు.

''ఫిబ్రవరిలోనే కరెంట్ ఇలా ఇస్తే, మార్చిలో ఏం ఇస్తరు?. రైతుల నుంచి ఫోన్ల మీద, ఫోన్లు వస్తున్నాయి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇట్లే ఉంటే వచ్చే ఎన్నికల్లో రైతులు ఓట్లేయ్యరు'' అని వివరించారు. సదరు మంత్రి అంతా విని మౌనంగా అక్కడ్నించి వెళ్లిపోయారు.

భవిష్యత్‌లో మరిన్ని కోతలు?

రానున్న రోజుల్లో మరిన్ని కరెంట్ కోతలు ఉండే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో విద్యుత్ ఉత్పత్తికి, డిమాండ్‌కు చాలా తేడా ఉందని చెపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కరెంట్ కొనుగోలు చేయాలంటే ముందుగా డబ్బులు చెల్లించాల్సి ఉందని అంటున్నారు.

కానీ ప్రస్తుతం డిస్కమ్‌ల ఆర్థిక సమస్యల కారణంతో పాటు వినియోగదారుల నుంచి ఏసీడీ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కరెంట్ కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో కోతలను అధిగమించేందుకు ఏం ప్లాన్ చేస్తుందో తెలియడం లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి : ఫామ్ హౌజ్ కేసులో సీబీఐ ఎంట్రీ! సర్కారులో టెన్షన్?

Tags:    

Similar News