బిగ్ న్యూస్: పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న BRS ఎమ్మెల్యేలు.. ఆ 30 నియోజకవర్గాల్లో గులాబీకి షాక్..!

బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వలసలకు రెడీ అవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కవని అనుమానమున్న నేతలందరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Update: 2023-03-04 02:56 GMT

బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వలసలకు రెడీ అవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కవని అనుమానమున్న నేతలందరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొందరు నేతలు ఆయా పార్టీలతో ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్ చేసుకున్నట్టు టాక్. వచ్చే ఎలక్షన్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్ దక్కడం కష్టమనే టాక్ ఉన్నది. విషయం గ్రహించిన లీడర్లు ముందు జాగ్రత్తగా తమ రాజకీయ భవిష్యత్తును ఇతర పార్టీల్లో వెతుక్కుంటున్నారు. ఇలా సుమారు 30 సెగ్మెంట్లలోని లీడర్లు ముందస్తుగా అరేంజ్‌మెంట్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఏర్పాటు దగ్గరి నుంచి చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వరుసగా రెండు సార్లు అవకాశం రాకపోవడంతో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి టికెట్ కోసం చివరి నిమిషం వరకూ వెయిట్ చేయొద్దనే భావనలో ఉన్నారు. అందుకని ఇప్పటి నుంచే పార్టీ పెద్దల నుంచి వచ్చే సంకేతాలను అంచనా వేసుకుని పార్టీలో ఉండాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకూ గులాబీ పార్టీలో ఉంటూ, చివరి నిమిషంలో టికెట్ దక్కకపోతే తమ పరిస్థితి ఏంటి? అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు. అలాగే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇదే తీరుగా ఆలోచిస్తున్నారు. మళ్లీ టికెట్ రాదనే అనుమానంలో ఉన్న లీడర్లు ఏ పార్టీలోకి వెళ్లాలి? అని మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తొలి దఫా మంతనాలు జరిపారు.

ఎవరి దారి వారిదే..

2018 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ సారీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో పలుమార్లు చెప్పారు. అయినా ఆయన మాటలను మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూడటం వల్ల ఇతర పార్టీల్లో అవకాశాలు సన్నగిల్లుతాయనే భయం వారిలో పట్టుకున్నది.

అందుకని ఇప్పటి నుంచే ఇతర పార్టీల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తారా? అనే అంశంపైనే హామీ తీసుకుంటున్నట్టు టాక్. అయితే కొందరి విషయంలో సానుకూలంగా స్పందిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఇంకొందరి విషయంలో మాత్రం పార్టీలోకి వచ్చిన తర్వాతే టికెట్ గురించి కన్ఫర్మేషన్ ఇస్తామని కండీషన్ పెడుతున్నట్టు సమాచారం.

30 స్థానాల్లో వలసల భయం..

వచ్చే ఎన్నికల్లో సుమారు 30 నియోజకవర్గాల్లో వలసలు ఉంటాయని ప్రగతిభవన్ వర్గాలు గుర్తించాయి. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉంటారని లిస్ట్ తయారు చేసినట్టు తెలుస్తున్నది. టికెట్ దక్కదని సంకేతాలు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లీడర్లలో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో ఉన్నారు.

అలాగే ఈసారి మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తే ఇతర పార్టీలోకి వెళ్లి పోటీ చేసేందుకు కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద స్థాయిలో ప్రభావం చూపే లీడర్లు రెడీగా ఉన్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్న కొందరు ఎమ్మెల్సీలు కూడా సొంత పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఇతర పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

టికెట్ల కోసం మంతనాలు జరుపుతున్న గులాబీ లీడర్ల జాబితా!

–గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ మంత్రి ఈసారి తనకు, తన ఫ్యామిలీ మెంబర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సొంత పార్టీలో చాన్స్ రాకపోతే ఇతర పార్టీలోకి వెళ్లి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

– గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేటర్ భర్త ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. టికెట్ రాకపోతే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారు.

– సిటీ శివారులోని ఓ సెగ్మెంట్ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే తమ్ముడు సొంత పార్టీలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడ చాన్స్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

– వెస్ట్ సిటీలో మంచి పట్టున్న ఓ ఎమ్మెల్సీ ఈ సారి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

– కంటోన్మెంట్ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న ఇద్దరు లీడర్లు పోటాపోటీగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకవేళ అక్కడ టికెట్ దక్కకపోతే చెరో పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

–సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ రాదనే అనుమానంతో బీజేపీ టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారు.

–మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌పై కన్నేశారు. రెండు చోట్లా తమ కుటుంబానికే టికెట్లు ఇవ్వాలని, లేకపోతే ఇతర పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు.

– ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. అది కుదరకపోతే కాంగ్రెస్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. అదే జిల్లా నుంచి ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

– ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ మాజీ మంత్రి తన కుమారుడికి ఈసారి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ పార్టీలో నో చెబితే కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారు.

– ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వరని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్ లేదా బీజేపీ టికెట్ కోసం ట్రై చేసుకుంటున్నారు.

Tags:    

Similar News