BRS ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనం.. అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమేనా..?

గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి

Update: 2023-05-19 04:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా పలు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పెండింగ్‌లో ఉన్న డెవలప్‌మెంట్ వర్క్స్, కొత్తగా రోడ్లు, డ్రైనేజీ లాంటి పనులకు అనుమతుల కోసం సీఎంకు మొరపెట్టుకున్నారు.

పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు రావడంతో కేసీఆర్ అసహనానికి లోనయ్యారు. తొమ్మిదేళ్లుగా ఇంత చేస్తున్నా ఇంకా కావాలంటూ వరుస విజ్ఞప్తులు చేయడమేమిటంటూ ముఖం మీదనే ప్రశ్నించారు. ఇప్పటిదాకా చేసినదానితోనే సరిపెట్టుకోవాలని, వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు పలికినట్లు కొద్దిమంది ఎమ్మెల్యేలు పెదవి విరిచారు.

గట్టిగా అడగలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక చాలా మంది ఎమ్మెల్యేలు ఇబ్బందుల్లో పడ్డారు. ఇదే విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు అనధికారికంగా ప్రస్తావిస్తూ, సిద్దిపేట్, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమే డెవలప్ అయితే సరిపోతుందా? తమ నియోజకవర్గాల గురించి ముఖ్యమంత్రి పట్టించుకోరా?.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాము తమ వ్యక్తిగత పనులో లేక అవసరాలనో ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లలేదని, నియోజకవర్గానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి పనులు, పెండింగ్ వర్క్స్ తదితరాలను మాత్రమే ప్రస్తావించామని గుర్తుచేశారు. ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ అవసరాలను ప్రభుత్వమే తీర్చలేకపోతే ఇక తాము ఎవరికి చెప్పుకోవాలని నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. కక్కలేని, మింగలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నామని వాపోయారు.

పోల్చి చూసుకుంటున్న ప్రజలు

గతంతో పోలిస్తే ప్రజలు ఇటీవలి కాలంలో రాజకీయంగా చైతన్యవంతులయ్యారని, అనేక పనులకు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలతో పోల్చి చూసుకుంటున్నారని ఒక ఎమ్మెల్యే గుర్తుచేశారు. మోడల్ పనులన్నీ ఆ మూడు నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయని, వాటినే తెలంగాణ మొత్తానికి హైలైట్ చేస్తూ పార్టీ, ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటున్నదని, దీనిపైనే ప్రజలు తమను నిలదీస్తున్నారని పేర్కొన్నారు.

రోడ్లు, డ్రైనేజీ ఫెసిలిటీ, కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, హాస్టళ్లు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్, బస్టాండ్, పార్కులు, లేక్ వ్యూ తదితరాలన్నింటినీ ప్రజలు ఆ స్థాయిలోనే కోరుకుంటున్నారని వెల్లడించారు. అటు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోలేక, ఇటు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నామని వాపోయారు.

సమాధానం చెప్పుకోలేక..

ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి అనేక రిక్వెస్టులు వస్తున్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాటిని ప్రభుత్వపరంగా మాత్రమే పరిష్కరించాలని, కానీ సీఎం నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో ఇకపై ఏం సమాధానం చెప్పుకోవాలనే సందిగ్ధంలో పడ్డామని పేర్కొంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలుగానీ, ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలుగానీ, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాయని గుర్తుచేశారు. కానీ వాటిని నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు బహిరంగంగానే నిలదీస్తారని, చెప్పుకోడానికి సమాధానం కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు నిలదీతలు, అడ్డుకోవడాలు పెరిగాయని గుర్తుచేశారు.

చిక్కులు ఎదురుకొవాల్సిందేనా..

చేసిందే చెప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి తాజా సమావేశంలో దిశానిర్దేశం చేశారని, కానీ పంచాయతీల్లో సర్పంచులు మొదలు ఎమ్మెల్యే వరకు అభివృద్ధి పనులు, కనీస సౌకర్యాలపై సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గతంలో కొన్ని పనులు మంజూరైనా, సకాలంలో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో పెండింగ్‌లో పడ్డాయని, పూర్తయ్యే దశలో ఉన్నా వినియోగానికి నోచుకోలేకపోతున్నాయన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రజలకు ప్రభుత్వంపైనా, పార్టీపైనా అసంతృప్తి ఉన్నదని, ఈ పనుల విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆ మూడు సెగ్మెంట్లకు వందల కోట్లు

మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గానికి తొమ్మిదేళ్ల కాలంలో రూ. 743 కోట్ల మేర నిధులు మంజూరైతే, అందులో రూ. 692 కోట్ల ఖర్చుతో దాదాపు 1800 పనులు జరిగాయని ఓ ఎమ్మెల్యే లెక్కలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి తొమ్మిదేళ్లలో రూ. 932 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, దాదాపు రెండు వేలకు పైగా పనులు కంప్లీట్ అయ్యాయని గుర్తుచేశారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ స్కూల్, హాస్టల్, రోడ్ల నిర్మాణం, పలు రకాల డెవలప్‌మెంట్ వర్క్స్ పూర్తయ్యాయని, ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి వెల్లడిస్తుండడంతో ప్రజలు కూడా ఆ స్థాయి అభివృద్ధిని తమ నియోజకవర్గాల్లో కోరుకుంటున్నారని ఆ ఎమ్మెల్యే గుర్తుచేశారు.

దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా చూపిస్తున్నా ఈ మూడు నియోజకవర్గాల అభివృద్ధినే నమూనాగా చూపించడం సాధ్యమా అని మరో ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. తాము అడిగినవాటిలో సొంతానికి ఏవీ లేవని, ప్రజలకు ఉమ్మడిగా ఉపయోగపడే పనులేనని చాలామంది ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. విస్తృతస్థాయి సమావేశాలు గతంలో జరిగినా ఎన్నడూ ఇలాంటి రిక్వెస్టులు పెట్టలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఉండాలన్న పార్టీ ప్రయోజనంతో నిధులు, అనుమతులు, అప్రూవల్ కోసం ప్రాధేయపడాల్సి వస్తున్నదని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News