మంత్రులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు: MLA పల్లా
రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని అన్నారు. మళ్లీ రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని అన్నారు. బోనస్ దేవుడెరుగు, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. జనగాం అధికారులు, వ్యాపారస్తులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేపర్లలో వార్తలు వచ్చాయి కానీ, ఆచరణలో శూన్యమన్నారు.
అంతేకాదు.. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా సమయంలో కూడా వడ్లు కొని 10 రోజుల్లోనే రైతుల అకౌంట్స్‌లో డబ్బులు వేసిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. ఇప్పుడు మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లయ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష కూడా చేయడం లేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైతుల కంటే ఎక్కువ మిల్లర్ల గురించి బాగా తెలుసని సెటైర్ వేశారు.