Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై కౌశిక్ రెడ్డి సెటైర్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ‘కేసీఆర్(KCR) ప్రభుత్వంలో దళితబంధు పథకం పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారు. ఇంకా 5,000 కుటుంబాలకు దళితబంధు(Dalit Bandhu) రావాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వాలని దళిత కుటుంబాలు అడిగితే నేను అక్కడికి వెళ్ళాను. పోలీసులు ఇష్టం ఉన్నట్లు వ్యవహరించారు. దళిత మహిళలను బూటు కాలుతో పోలీసులు తన్నారు. నాపైనా దాడి చేశారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తా.. కానీ దళితబంధు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటే మాత్రం ఊరుకోను’ అని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి(Mallu Bhatti Vikramarka) ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని కూడా కేసీఆర్(KCR) పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారని గుర్తుచేశారు. ధర్నాలు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఏసీపీ అంటున్నారు. హక్కుల కోసం పోరాడటం తప్పా అని అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ, ఇప్పటివరకు పాత డబ్బులు కూడా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడి కలెక్టర్‌ను పరిగెత్తించారు. దళితబంధు ఇవ్వకపోతే హుజురాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితులే వస్తాయని హెచ్చరించారు.
తన పోరాటం పోలీసుల మీద కాదని.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపైన అని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తా అని అంటే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితుల వద్ద పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసింది జేసీబీకు ఎక్కించడానికి కాదని అన్నారు. కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా...? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భాషను సరిదిద్దుకోవాలని అన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాననే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.