KCR : రేపు కాళేశ్వరానికి బీఆర్ఎస్.. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తరలివెళ్తుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తరలివెళ్తుంది. రెండురోజుల పాటు పర్యటించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బయలు దేరనున్నారు. రెండు బస్సుల్లో వెళ్లేందుకు అన్ని పార్టీ సిద్ధం చేసింది. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శిస్తారు. అందులో భాగంగా ఎల్ఎండీ పనులను పరిశీలిస్తారు. అనంతరం రామగుండంలో బృందం బసచేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు.
11 గంటలకు మేడిగడ్డను పరిశీలిస్తారు. గోదావరికి వస్తున్న వరదను ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నట్లు నేతలు తెలిపారు. కన్నెపల్లి పంపు హౌజ్‌లను ప్రారంభించి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, మిడ్ మానేరు రిజర్వాయర్, ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండీ రిజర్వాయర్లను నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకే ప్రాజెక్టు సందర్శన అని వెల్లడించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
నేడు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కొనసాగుతుంది. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో గులాబీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ ప్రసంగంలో పాల్గొననున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బడ్జెట్‌ను పెట్టిన కేసీఆర్, ప్రతిపక్ష నేత హోదాలో మొదటి సారి అసెంబ్లీకి హాజరు అవుతున్నారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.