అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ల వెనుక బీఆర్ఎస్ పెద్దలు.. ఆ కంపెనీపై అనేక అనుమానాలు!

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భూముల డాటా మొత్తం టెర్రాసిస్ టెక్నాలజీస్ చేతిలో పెట్టింది. సర్వహక్కులూ దానికి అప్పగించి చోద్యం చూసింది.

Update: 2024-10-19 03:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భూముల డాటా మొత్తం టెర్రాసిస్ టెక్నాలజీస్ చేతిలో పెట్టింది. సర్వహక్కులూ దానికి అప్పగించి చోద్యం చూసింది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్నో మెరుగైన సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నా టెర్రాసిస్‌కు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారస్త్రంగా చేసుకున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. సదరు ఏజెన్సీపై సమగ్ర విచారణ చేయించి అప్పగింత వెనుకున్న కుట్రలను వెలికి తీయించారు. లక్షలాది రైతుల భూములు, రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తుల రికార్డులన్నీ విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని గుర్తించారు. అయితే మరో పది రోజుల్లో టెర్రాసిస్ కంపెనీ కాలపరిమితి ముగియనున్నది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐసీకి అప్పగించింది. త్వరలో కార్యకలాపాలన్నీ ఆ కంపెనీ చేతుల్లోకి వెళ్లనున్నాయి. అయితే ఆపరేటర్లు, అనుసంధాన ఉద్యోగుల వ్యవహారమంతా టీఎస్ చూడనున్నది.

అర్హత లేని కంపెనీకి బాధ్యతలు

2018లో టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవలప్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది. ఐతే బిడ్డింగ్స్‌కి ఆహ్వానించినప్పుడు రెండే కంపెనీలు వచ్చాయి. అందులో ఒకదానిపై టెక్నికల్‌గా అనర్హత వేటు వేశారు. మిగిలిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఈ బిడ్డింగ్ ప్రక్రియ మొత్తం ఐటీ శాఖనే నిర్వహించింది. ఈ ప్రక్రియ మొత్తం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు కంప్లీట్ చేశారు. అయితే ఏ లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం లేని కంపెనీకి కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపించారో అర్థం కాని విషయం. టెర్రాసిస్ పేరు, డైరెక్టర్లు మారడం, వాటాలు అమ్ముకోవడంతో ఫాల్కాన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చేతులు మారడం వెనుక ఆంతర్యం ఏంటీ? కంపెనీ పేరు మారినా కాంట్రాక్ట్ రద్దు చేయలేదు. గతేడాది అక్టోబర్ వరకే గడువు ముగిసినా ఏకపక్షంగా మరో ఏడాది పొడిగించారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అనేక భూములు తారుమారు అయ్యాయన్న ఆరోపణలున్నాయి.

చేతులు మారిన భూములు

జీవో 111 ఎత్తేసిన తర్వాత రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగి భూములు చేతులు మారాయి. నిషేధిత జాబితాలోని భూములను కొల్లగొట్టారు. బినామీ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇలాంటి అనేక లావాదేవీలు అర్ధరాత్రి జరగడం వెనుక పెద్ద మతలబే ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనికి అప్పటి ఓ మంత్రి పేరును బాగా వాడుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వివాదాస్పద భూముల్లో ఆధిపత్యాన్ని సాధించారు. ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ చేతిలో పెట్టడం ద్వారానే ఈ దందాను సులువుగా చేయగలిగారన్న ఆరోపణలున్నాయి. ఎన్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తే ఆఫీసు టైంలో, ఆఫీసు ప్రాంగణంలోనే లావాదేవీలకు అవకాశం ఉండేది. దాంతో అక్రమాలకు తావు ఉండక పోయేదన్న విమర్శలున్నాయి.



 



Similar News