‘కారు’ నేతల్లో కంగారు.. గెలుస్తామా.. లేదా అని టెన్షన్.. టెన్షన్..!

ఓట్ల లెక్కింపునకు ఒకరోజే మిగిలి ఉంది. మరోవైపు గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. గెలుస్తామా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. గ్రామ, మండల

Update: 2023-12-02 02:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓట్ల లెక్కింపునకు ఒకరోజే మిగిలి ఉంది. మరోవైపు గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. గెలుస్తామా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. గ్రామ, మండల నేతలతో ఎమ్మెల్యే అభ్యర్థులు రివ్యూలు చేస్తున్నారు. ఏ మండలంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయని వివరాలు సేకరిస్తున్నారు. ఒక వేళ గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు.

సర్వేలతో గుబులు

కారు పార్టీ నేతల్లో కంగారు మొదలైంది. ఒకవైపు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌ బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా వస్తుండటంతో గ్రామస్థాయి నుంచి మొదలుకొని నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులు రివ్యూ నిర్వహించినట్లు సమాచారం. గ్రామాలవారీగా పోలైన ఓట్లు, బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేసిన ఓట్ల వివరాలపై చర్చించారు. బూత్ ఇన్‌చార్జిలతోనూ సమాచారం సేకరించారు.

ఎటువైపు ప్రజలు మొగ్గుచూపారనే అంశాలపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఒక్కో నియోజకవర్గంలో ఏ మండలం ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే వివరాలపైనా సమీక్షించారు. అయితే ఎక్కువ మండలాల ప్రజలు ఇతర పార్టీలవైపు మొగ్గుచూపినట్లు నేతల సర్వేలో తెలడంతో గెలుస్తామా? లేదా? అని గుబులు చెందుతున్నారు.

కాంగ్రెస్ కేడర్ బాగా పని చేసిందని..

సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందించలేదని ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మారితే లాభం కలుగుతుందనే భావనకు వచ్చారు. అదే మౌత్ టాక్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో బూత్‌ల వారీగా కాంగ్రెస్ కేడర్ తీవ్రంగా పనిచేసిందని తేలింది. ప్రతి ఓటరును కలవడంతో ప్రభుత్వ వ్యతిరేకత హస్తం పార్టీకి బాగా కలిసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదే విషయం రివ్యూలోనూ స్పష్టమైనట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కేసీఆర్‌ను నమ్ముకున్న గులాబీ నేతలు.. ప్రస్తుత పరిణామాలు, సర్వేలు సైతం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వస్తుండటంతో కంటిమీద కునుకులేకుండా పోతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 


Similar News