కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక రిక్వెస్ట్!
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటందుకు వరుస ఘటనలే నిదర్శనం అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటందుకు వరుస ఘటనలే నిదర్శనం అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. భూపాలపల్లి ఎస్సై లైంగిక దాడి ఘటనపై స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని మండిపడ్డారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారని, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారని తెలిపారు.
అలాగే పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నదని, రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షించే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య అన్నారు. అంతేగాక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని, ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.