ఏడాదిలో ఎన్నికలు.. పక్కా స్కెచ్‌ రెడీ చేస్తున్న కారుపార్టీ

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో ఏడాది ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే గులాబీ సన్నద్ధమవుతోంది.

Update: 2024-10-16 02:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో ఏడాది ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే గులాబీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కసరత్తును ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్‌లో మూసీ సుందరీకరణ పేరుతో పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను రెడ్ మార్క్ వేసి కూల్చుతున్నారు. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బాధితులతో కేసులు వేస్తూనే మరోవైపు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. అయితే, వారం రోజులకు పైగా మూసీపై బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదు. దీంతో మళ్లీ కార్యాచరణ చేపట్టి జనంలోకి వెళ్లాలని పార్టీ భావిస్తోంది.

తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. హైడ్రా, మూసీపై అనుసరించాల్సిన విధివిధానాలపై లీడర్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు పార్టీ కార్యాచరణ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించే అవకాశమున్నట్టు సమాచారం. పార్టీని గ్రేటర్‌లో మరింత యాక్టివ్ చేయాలని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.


Similar News