BRS: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఎస్కాట్ వాహనం ఎందుకు?
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Thirupathi Reddy)కి ఎస్కాట్ వాహనం ఎందుకు ఇస్తున్నారో డీజీపీ జితేందర్, సీఎస్ శాంతి కుమారి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్(BRS) నాయకులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Thirupathi Reddy)కి ఎస్కాట్ వాహనం ఎందుకు ఇస్తున్నారో డీజీపీ జితేందర్, సీఎస్ శాంతి కుమారి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్(BRS) నాయకులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల మరో నందిగ్రామ్‌లాగా మారుతోందని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 144 సెక్షన్ ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా కాదని.. అసలు తిరుపతి రెడ్డికి ఎందుకు ఎస్కార్ట్ వాహనం ఇస్తున్నారో చెప్పాలని అడిగారు. లగచర్ల తండాల్లో రజాకార్ల పాలన సాగిస్తున్నారు.
రజాకార్ల నాయకుడు తిరుపతి రెడ్డి అని కీలక ఆరోపణలు చేశారు. లగచర్లలో రైతుల నిరసన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని అన్నారు. లగచర్ల గిరిజనులపై రాత్రికి, రాత్రి దాడులు చేసి వారిని కొట్టారని మండిపడ్డారు. ఏడో గ్యారంటీ కింద రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చిందని అన్నారు. సమైక్య పాలనలో ఇలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర విషం తప్ప విషయం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకపోవడం అంటే తెలంగాణను లేకుండా చేయడమే అని అన్నారు. లగచర్లలో రైతులు తిరగబడితే దీని వెనుక బీఆర్ఎస్ ఉందని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.