ఓటర్ల మైండ్‌సెట్‌పై ఎఫెక్ట్ చూపేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ గేమ్ ప్లాన్!

ఒపీనియన్ పోల్ సర్వేలతో ఇప్పటికే కొద్దిమంది ఓటర్లు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలపై రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రకటనలు, లీకులు ఇస్తున్నాయి.

Update: 2023-11-30 02:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఒపీనియన్ పోల్ సర్వేలతో ఇప్పటికే కొద్దిమంది ఓటర్లు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలపై రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రకటనలు, లీకులు ఇస్తున్నాయి. మొత్తం 80 సీట్లకు తగ్గకుండా గెలుస్తున్నామని, అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించడంతో పాటు ఎల్బీ స్టేడియంలో డిసెంబరు 9న ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ జరగడానికి ముందురోజు (బుధవారం) ఆలయాలు, దర్గాలను సందర్శించిన తర్వాత సిక్స్ గ్యారెంటీస్‌కు చట్టబద్ధత కల్పించే ఫైళ్లపైనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం చేస్తుందని ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

మొదట ఆరు గ్యారెంటీలపైనే..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల నగదు సాయంతో పాటు తులం బంగారం పంపిణీ, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్, ప్రతి మహిళ ఖాతాలో రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం, వంట గ్యాస్‌ సిలిండర్‌ను రూ. 500లకు అందించడం, వృద్ధులు, వితంతువులకు, దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచడం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం తదితర ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం అని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైలుపై కూడా సంతకం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

అసైన్డ్ భూములపైనే తొలి సంతకం..

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే మెసేజ్ ఓటర్లలోకి బలంగా వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ సైతం అదే తరహాలో కొన్ని లీకులు ఇచ్చింది. కొత్త సచివాలయం ప్రాంగణంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, అనువైన తేదీ, ముహూర్తం కోసం పురోహితులను కేసీఆర్ సంప్రదిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి లీకులు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం గడుతున్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారని పేర్కొన్నాయి.

అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ఫైలుపై తొలి సంతకం చేసేలా అధికారులతో చర్చలు కూడా పూర్తయినట్లు వెల్లడించాయి. అయితే కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ గురువారం జరిగే పోలింగ్ సరళిని ప్రభావితం చేసేలా ఉందనే అభిప్రాయానికి రావడంతోనే అందుకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ తరహా లీకులిచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News