రాహుల్ ఇష్యూపై బీఆర్ఎస్ సమిష్టి పోరు.. జాతీయ లీడర్లకు కేసీఆర్ ఫోన్లు..!
రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత రద్దుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు సపోర్ట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..
దిశ, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత రద్దుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు సపోర్ట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ ప్రాంతీయ లీడర్లతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆయన హస్తీనాకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ గెజిట్ విడుదల చేసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా రాహుల్ కు సపోర్టుగా నిలుస్తూ ప్రకటనలు చేశారు.
విపక్షాల లీడర్లతో మంతనాలు
రాహుల్ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఇందుకు తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నది. త్వరలో ఢిల్లీ వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీయాలని ఆలోచన చేస్తున్నది. అయితే కాంగ్రెస్ పోరుకు సపోర్టు చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన.. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, స్టాలిన్ తో మాట్లాడుతున్నట్టు ప్రచారంలో ఉంది. త్వరలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు. అక్కడ జరిగే ఆందోళనలో ఆయన పాల్గొంటారా? లేదా ? అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.
Also Read..