తొందరపడొద్దు.. ఆ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లు

ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది.

Update: 2024-06-16 02:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. వారిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి, తొందరపడొద్దని, అదైర్యపడొద్దని అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం. పార్టీ మారి ఇబ్బందులు పడొద్దని, రాజకీయ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా కంటోన్మెంట్ బైపోల్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో బీఆర్ఎస్ బలం 35కు పడిపోయింది.

అయితే కారు దిగేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరికి కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. తొలివిడతగా 11 మంది చేరేందుకు రంగం కూడా సిద్ధమైనట్లు సమాచారం అందడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వారు పార్టీ మారకుండా పార్టీ సీనియర్లతో పాటు అధినేత కేసీఆర్ సైతం ఫోన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడొద్దని అందరూ అండగా నిలవాలని సూచిస్తున్నట్లు తెలిసింది. పార్టీని బలోపేతం చేసుకుందామని, భవిష్యత్ బీఆర్ఎస్‌దే అంటూ భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో నేతలంతా రాజకీయ భవిష్యత్ పై ఆలోచనలో పడ్డారు. కొంతమంది లోక్ సభ ఎన్నికలకు ముందే కారు దిగడంతో కేడర్, నేతలు మరింత కుంగుబాటుకు గురయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ముందే పార్టీ మారే ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే క్షేత్రస్థాయిలో ఇక గులాబీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.

ఒకపక్క ‘తాను తలచుకుంటే కేసీఆర్ పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారో లెక్కేసుకోవాలని’ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించగా, మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం 25మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెనుదుమారాన్ని లేపాయి. లోక్ సభలో ఎన్నికల్లో 14 చోట్ల ఏకంగా మూడోస్థానంలోకి పడిపోవడంతో ఇక పార్టీలో మనుగడ కష్టమవుతుందన్న ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం, ఇప్పటికే మాజీమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జాకేసులు నమోదవ్వడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తాము సేఫ్ గా ఉండవచ్చన్న భావనలో పార్టీ నేతలు ఉన్నారు.

ఫాం హౌజ్‌లో భేటీలు

బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో చాలా మందికి రేవంత్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో వారు పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో గులాబీ నేత అప్రమత్తమయ్యారు. వారిని ఫాంహౌజ్ కు పిలిచి మాట్లాడుతున్నట్లు సమాచారం. మరికొందరికి ఫోన్లు చేసి పార్టీ మారొద్దని సూచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ మారితే రాజకీయ భవిష్యత్ కోల్పోతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ మారిన రంజిత్ రెడ్డి, బీబీపాటిల్ ఓటమి తీరును సైతం వివరిస్తున్నట్లు తెలిసింది. అయితే కేసీఆర్ భరోసా ఇచ్చినప్పటికీ పార్టీలో ఎంతమంది ఉంటారో.. ఎంతమంది పార్టీ మారుతారోననేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


Similar News