వరుస అలజడుల వెనుక బీఆర్ఎస్..? కుట్రలు బయటపెట్టేందుకు టీపీసీసీ ప్లాన్
రాష్ట్రంలో వరుస అలజడుల వెనక బీఆర్ఎస్ కుట్ర ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో/అలంపూర్ టౌన్: రాష్ట్రంలో వరుస అలజడుల వెనక బీఆర్ఎస్ కుట్ర ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నది. వరుస ఘటనలతో కాంగ్రెస్ పార్టీ మైలేజీ మసక బారుతున్నందున అప్రమత్తమైన పార్టీ, లీగల్ సెల్స్, సోషల్ మీడియా టీమ్స్, ప్రచార కమిటీలను అలర్ట్ చేసింది. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఆగడాలకు చెక్ పెట్టాలని స్పోక్స్ పర్సన్, ప్రచార కమిటీలకు టాస్క్ ఇచ్చింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించింది. జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై కుట్ర చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత పార్టీ పై ఉన్నదని, ఇందుకు కీలక నేతలు, లీడర్లు మరింత యాక్టివ్ కావాలని పీసీసీ స్పష్టంచేసింది. ఇక అన్ని జిల్లాల్లో ప్రెస్‌మీట్లు, పబ్లిసిటీ చేయాలని డీసీసీలకూ సూచించింది. బీఆర్ఎస్ కుట్రలపై క్లారిటీ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని భావించిన కాంగ్రెస్.. పార్టీకి డ్యామేజ్ కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది.
వరుస ఘటనలపై సీరియస్..
లగచర్ల మొదలుకుని ఉమెన్స్ కాలేజీలో తాజాగా జరిగిన ఆందోళన వరకు బీఆర్ఎస్ ఇన్వాల్వ్‌మెంట్ పక్కాగా ఉన్నదని పార్టీకి సమాచారం ఉన్నది. ప్రధానంగా 4 ఘటనలపై కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. కొడంగల్ సెగ్మెంట్ లగచర్లలో జరిగిన ఆందోళనలు, కలెక్టర్‌పై దాడి బీఆర్‌ఎస్ కుట్రే అని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నది. రైతుల జాబితాలో కలెక్టర్‌పై దాడి చేసిన వ్యక్తికి భూమి లేకపోవడంతో కాంగ్రెస్ అనుమానానికి మరింత బలం చేకూరింది. ఇక వరుసగా హాస్టళ్లలలో పుడ్ పాయిజన్ ఘటనల్లోనూ బీఆర్ఎస్ పాత్ర ఉన్ననది అనుమానిస్తున్నది. ఒకే హాస్టల్‌లో 3 సార్లు పుడ్ పాయిజన్ అవడంలో ఆ అనుమానం మరింత బలపడింది. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లోనూ బీఆర్‌ఎస్ హస్తముందని పార్టీ భావిస్తున్నది. ఉమెన్స్ కాలేజీకి యూజీసీ హోదా కోరుతూ విద్యార్ధినీలు క్యాంపస్ లోనే ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. యూజీసీ అప్రూవల్ లేకుండా తమ సర్టిఫికేట్లు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ఇందులో కూడా గులాబీ హస్తం ఉందని, ఫ్యాకల్టీలోని కొందరు బీఆర్ఎస్‌కు మద్ధతు దారులుగా ఉన్నారని, వారి కుట్రతోనే ఇదంతా జరిగిందని అనుకుంటున్నారు.