గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. సంబరాలకు రెడీగా ఉండాలని కేడర్‌కు BRS, కాంగ్రెస్ సూచన..!

గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని బీఆర్ఎస్, తమదే అధికారమని కాంగ్రెస్ ప్రకటించాయి. ఈ నెల 3న

Update: 2023-12-01 03:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని బీఆర్ఎస్, తమదే అధికారమని కాంగ్రెస్ ప్రకటించాయి. ఈ నెల 3న సంబురాలు చేసేందుకు రెడీగా ఉండాలని రెండు పార్టీలూ తమ కేడర్‌కు పిలుపునిచ్చాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే అటు మంత్రి కేటీఆర్, ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండు పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తల సందడి నెలకొన్నది. తమ పార్టీనే పవర్‌లోకి వస్తుందనే ఉత్సాహంతో కనిపించారు.

ఫుల్ జోష్‌లో కాంగ్రెస్

అధికారంలోకి వస్తున్నామనే జోష్‌లో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు అభ్యర్థులకు విష్ చేస్తూ మెసేజ్‌లు పంపారు. లీడర్లు సైతం అధికారంలోకి వస్తున్నామని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అయితే దాదాపు 70 సీట్లు గెలుస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఏ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారోనని లెక్కలు తీశారు. రిజల్ట్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు రెడీగా ఉండాలని పార్టీ లీడర్లను రెడీ చేశారు.

వార్ రూమ్‌లో సంబురాలు

పోలింగ్ ముగిసిన వెంటనే మళ్లీ తామే అధికారంలోకి వస్తున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వార్ రూమ్‌లో ఉన్న లీడర్లు సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసేందుకు రెడీగా ఉండాలని కేడర్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తరువాత ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తామే మళ్లీ పవర్ లోకి వస్తున్నట్టు ప్రకటించారు.

ముహూర్తాలు ఖరారు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు ఖరారు చేసుకున్నాయి. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారోత్సవం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అ రోజున కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తామని వెల్లడించారు. మూడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు కేసీఆర్ డిసెంబరు 7న ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతున్నది. ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న సెక్రటేరియట్ ముందు ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో ఉన్నట్టు లీకులు ఇస్తున్నారు.


Similar News