ఒలింపిక్స్ లో దేశం గర్వించేలా మెడల్స్ తీసుకురండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పారిస్‌లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా పథకాలు తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

Update: 2024-07-27 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పారిస్‌లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా పథకాలు తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. 2024 ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి శనివారం ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదంతో పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు.. తమ స్వప్నాన్ని సాకారం చేసుకునే తుది అంకానికి చేరుకున్నారని పేర్కొన్నారు. 2023లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 107 మెడల్స్ సాధించిందని ఆయన గుర్తుచేశారు.

ఒలింపిక్ పథకాన్ని సాధించాలన్న లక్ష్యమే ఊపిరిగా పెట్టుకున్న క్రీడాకారుల స్వప్నానికి రూపమిచ్చేలా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టీఓపీఎస్) పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే భారతదేశ మిషన్ ఒలింపిక్స్ సెల్(ఎంఓసీ) అనే ఓ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. ఇందులో మాజీ అథ్లెట్లు, కోచ్‌లు, పలు క్రీడా సంఘాలకు సంబంధించిన సమర్థులైన అధికారులను కేంద్రం నియమించిందని వివరించారు. వీటి ద్వారా క్రీడాకారులు పథకాలు సాధించేందుకు ఏమేం కావాలి, వాటిని ఎలా సమకూర్చాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ సాధించిన పీవీ సింధు.. మూడోసారి ఒలింపిక్స్ పథకాన్ని సాధించేలా 12 మంది ప్రత్యేక నిపుణుల బృందం ఆమెకు సహకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా.. జర్మనీ-ఫ్రెంచ్ సరిహద్దుల్లోని ‘సార్ బ్రూకెన్’ అనే చోట సింధుకు బూట్ క్యాంప్ ఏర్పాటుచేసి శిక్షణనిస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. టేబుల్ టెన్నిస్ చాంపియన్ మానికా బాత్రా కోసం.. బాల్ బౌన్సింగ్, పేస్, స్పిన్ బాగా ఉండే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టేబుల్ టెన్నిస్ బల్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. హార్స్ రైడింగ్‌లో భాగమైన.. ఈక్వెస్ట్రేన్ పోటీలో పాల్గొనే అనుష్ అగర్వాల్ కోసం.. ఆయన గుర్రానికి అవసరమయ్యే ప్రత్యేక ఫీడ్ ను, బ్లాంకెట్లు, బూట్స్, సాడిల్స్ వంటివి సమకూర్చినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం భారతదేశపు తొలి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రూ.634.34 కోట్లతో మణిపూర్‌లో ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కోచింగ్, స్పోర్ట్స్ సైకాలజీ వంటి కీలకమైన అంశాలపై ఈ యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఖేలో ఇండియా కేంద్రాలు, 30కి పైగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు క్రీడాకారుల కోసం పనిచేస్తున్నాయన్నారు. దీంతోపాటుగా మనదేశపు ప్రాచీన క్రీడలైన మల్లకుంభ్, థాంగ్ టా, గట్కా, కల్పెట్ట వంటి క్రీడలను ప్రమోట్ చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఖేల్ మహాకుంబ్’ వంటి వేదికల ద్వారా.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిక్షిప్తంగా ఉన్న క్రీడాసామర్థ్యాన్ని వెలికితీసి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఒలింపిక్స్ కు వెళ్లిన క్రీడాకారులు విజయంతో తిరిగిరావాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.


Similar News