BREAKING: వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడంపై కీలక వ్యాఖ్యలు
సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్రెడ్డి బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు.
దిశ, వెబ్డెస్క్: సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్రెడ్డి బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జాతర నిర్వాహాకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను వేడుకున్నానని పేర్కొన్నారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములుగు నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు.
‘హాత్ సే హాత్‘ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి రూ.110 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారికి ఎదురొడ్డి నిలబడతారని అన్నారు. సమ్మక్క, సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కిషన్ రెడ్డి చెప్పినట్లుగా విన్నాను. అలా అయితే, కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు. కేంద్రం మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. గతంలో కుంభమేళాకు కేంద్రం రూ.వందల కోట్లు విడుదల చేసిందని తెలిపారు.