ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాది.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి
ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, అమలులో, ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ప్రణాళిక, అర్థ గణాంక శాఖ ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, కాకతీయ గవర్నెన్స్ ఫెలోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా అందే విధంగా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కీలకమైన ప్రణాళిక, అర్థ గణాంక శాఖ అధికారులు, సీజీస్, కేజీఎఫ్ బృందాలు ఉత్తమ ప్రణాళికలతో పనిచేయాలని, అప్పుడే ప్రగతికి గట్టి పునాదులు పడతాయన్నారు. ప్రణాళికా శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు, అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, రాష్ట్ర ప్రణాళికా అభివృద్ధి సొసైటీ పర్యవేక్షణ అధికారి రామకృష్ణ, సలహాదారు రామభద్రం, సీజీస్, కేజీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.