బీజేపీ రెండో జాబితా రెడీ.. తెలంగాణలో మాజీ ఐపీఎస్ కు ఛాన్స్!

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాపై కసరత్తు వేగవంతం చేసింది.

Update: 2024-03-09 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. తాజాాగా రెండో జాబితాపై కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణ కు సంబంధించి మొదటి లిస్ట్ లోనే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన 8 స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించబోతున్నట్లు సమాచారం. వీలైతే రేపు లేదా ఎల్లుండి బీజేపీ సెకండ్ లిస్ట్ అనౌన్స్ మెంట్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రెండో జాబితాలో అనూహ్య నిర్ణయాలు ఉండబోతున్నాయనే ప్రచారంతో బీజేపీ రెండో జాబితాపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా కీలక నేతలు ప్రత్యేక ప్రణాళికతో పావులు కదుపుతన్నట్లు తెలుస్తోంది. 

సెకండ్ లిస్ట్ లో భారీ సర్ ప్రైజ్!:

తెలంగాణలో పెండింగ్ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ఆరు స్థానాలకు రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటిస్తారని మిగతా రెండు చోట్ల ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వెల్లడిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరలేపింది. దీంతో అభ్యర్థుల మార్పులు, పార్టీలోకి చేరికలతో సెకండ్ లిస్ట్ లో భారీ సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని, ఇదే సమయంలో ప్రచారం వేళ కీలక నేతలకు సరికొత్త బాధ్యతలు అప్పగించే ప్లాన్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. 

ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా సెకండ్ లిస్ట్:

ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. పెండింగ్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు వంటి ముఖ్యనేతలు ఆశావహులుగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఏంటి అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఇక వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కు చోటు కల్పించడంతో పాటు స్టార్ క్యాంపెయినర్ గా మందకృష్ణ మాదిగకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు జాతీయ స్థాయిలో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నారని ఇందులో భాగంగా రెండో జాబితాలో  టీమిండియా క్రికెటర్లతో పాటు సినీ యాక్టర్లకు, ఆయా రంగాల్లోని ప్రముఖుల పేర్లు ప్రకటించబోతున్నట్లు  జాతీయ మీడియాలో జోరుగా  ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News