T- కాంగ్రెస్‌‌లో చేరికలకు బ్రేక్ వేసేలా బీజేపీ భారీ వ్యూహం..?

కాంగ్రెస్‌‌లో చేరికలను కట్టడి చేసేందుకు బీజేపీ లీడర్లు ప్లాన్ సిద్ధం చేశారు.

Update: 2023-07-14 03:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌‌లో చేరికలను కట్టడి చేసేందుకు బీజేపీ లీడర్లు ప్లాన్ సిద్ధం చేశారు. బీఆర్ఎస్‌ను వీడే లీడర్ల జాబితాను తయారు చేశారు. వారిలో హస్తం పార్టీలోకి వెళ్లే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ‘మా పార్టీలోకి రావాలి. ఇష్టం లేకపోతే అక్కడే ఉండాలి. అంతే కానీ కాంగ్రెస్‌లో ఎట్టి పరిస్థితిల్లోనూ చేరొద్దు’ అంటూ వారికి సలహాలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో బీఆర్ఎస్ అసంతృప్త లీడర్లు పరేషాన్ అవుతున్నారు. వలసల కట్టడి పేరుతో బీజేపీ నేతలు పరోక్షంగా బీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ చేరికలపై బీజేపీ కట్టడి

కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు పెరిగింది. అదే సమయంలో బీజేపీలో జరిగిన రాష్ట్ర నాయకత్వ మార్పూ ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం సృష్టించింది. ఇది కాంగ్రెస్‌కు మరింత కలిసొచ్చి, బీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్సే ప్రత్యామ్నయం అనే టాక్ మొదలైంది. ఇంతకాలం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న అసంతృప్త లీడర్లు తమ మనస్సు మార్చుకొని కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.

ఇదే ప్రస్తుతం బీజేపీ లీడర్లను కంగారు పెట్టిస్తున్నది. పార్టీ మారేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్లకు ఈ మధ్యే బీజేపీలో కీలక పదవి దక్కిన ఓ లీడర్ నేరుగా ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరొద్దని చెబుతున్నట్టు తెలుస్తున్నది. అందులో చేరితే భవిష్యత్ ఉండదని, తమ పార్టీలోకి రావాలని, లేకపోతే బీఆర్ఎస్‌లోనే కొనసాగాలని సూచిస్తున్నట్టు సమాచారం.

పరోక్షంగా గులాబీ పార్టీకి లాభం..?

కాంగ్రెస్‌లో చేరికలు లేకుండా చేయాలని బీజేపీ లీడర్ల వ్యూహం పరోక్షంగా బీఆర్ఎస్‌కు లాభం కలిగించేలా కనిపిస్తున్నది. ఇతర పార్టీలో ఇబ్బందిగా ఉన్న లీడర్లతో సంప్రదింపులు చేసి తమ పార్టీలోకి రావాలని చెప్పి చేర్చుకోవడం సహజం. కానీ బీజేపీకి చెందిన సదరు లీడర్ చేస్తున్న పని మాత్రం బీఆర్ఎస్‌కు బూస్టింగ్ ఇచ్చే విధంగా ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్‌లోని అసంతృప్తి లీడర్లను కాంగ్రెస్‌లో చేరొద్దని, అక్కడే కొనసాగాలని చెప్పడం వెనుక ఆంతర్యమేంటనే విషయంపై ఆరా తీస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

- ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. ఆయనకు బీజేపీ లీడర్లు ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరొద్దని, తమ పార్టీలోకి వచ్చేందుకు ఇష్టం లేకపోతే బీఆర్ఎస్‌లోనే కొనసాగాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

– దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నేత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న బీజేపీ లీడర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో చేరొద్దని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News