తెలంగాణలో BJP భారీ ప్లాన్.. ఒక్కో నియోజకవర్గంపై ఊహించని రేంజ్‌లో స్కెచ్?

అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

Update: 2022-12-17 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఒక్కో నియోజకవర్గం బాధ్యతలను నలుగురికి అప్పగించనుంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక విస్తారక్, ఒక ప్రభారి, ఒక కన్వీనర్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 'పాలక్' లను నియమించనుంది. మూడంచెల వ్యవస్థను పటిష్టం చేసి, దానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర నాయకత్వానికి అందించడమే 'పాలక్'లకున్న ప్రధాన టాస్క్. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు పాలక్ లుగా బాధ్యతలు అప్పగించనున్నారు. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కనీసం మూడు రోజులపాటు పర్యటించి పార్టీ పనితీరు, బలోపేతం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు వారు రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు అందించనున్నారు.

స్థానికేతరులకే..

స్థానికులైతే రిపోర్ట్ పారదర్శకంగా ఉండదని భావించిన అధిష్టానం స్థానికేతరులకు పాలక్ లుగా బాధ్యతలు అప్పగించనుంది. దీనిద్వారా నియోజకవర్గాల్లో లోటుపాట్లు కచ్చితంగా తెలిసొస్తాయని, తప్పొప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగేందుకు సులువవుతుందని రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా గ్రామస్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటును వేగవంతంగా పూర్తిచేయడంతో పాటు ప్రతి గ్రామానికి గ్రూపులు ఏర్పాటుచేసి పార్టీ కార్యకలాపాలను విస్తరించడం, ప్రజలను చైతన్యవంతులను చేసుకోవడం, ఓటర్లకు చేరువకావడం వీరిపై ఉన్న ప్రధాన బాధ్యత. ఎన్నికల సమయంలో తలెత్తే ఇబ్బందులను ఇక్కడే గుర్తించి వాటిని తమకు అనుగుణంగా మార్చుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి సారిస్తున్నది.

ఇప్పటికే మూడంచెల వ్యవస్థ

ఇప్పటికే మూడంచెల వ్యవస్థ ద్వారా పార్టీని బలోపేతం చేశారు. విస్తారక్ గా నియమితులైన వారు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఫుల్ టైమర్లుగా కొనసాగుతున్నారు. సెగ్మెంట్లలో ఇతర పార్టీల వ్యూహాలు, నేతల తీరును గమనించి దానికి అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారు. ప్రభారీలు కనీసం నెలలో పది రోజులు తమకు కేటాయించిన నియోజకవర్గంలో పర్యటించి నివేదికలను రాష్ట్ర నాయకత్వానికి అందిస్తున్నారు. అసెంబ్లీ కన్వీనర్లు కూడా నెలలో కనీసం వారమైనా వారికి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Also Read...

ఎమ్మెల్యే 'పైలట్‌'కు ఈడీ నోటీసు... నేడు సీఎంతో భేటీ 

Tags:    

Similar News