ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేదు : బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి
తెల్లకోటును రక్తపు మడుగులో ముంచిన కిరాతకులని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెల్లకోటును రక్తపు మడుగులో ముంచిన కిరాతకులని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ఆమె ఫైరయ్యారు. త్వరలో డాక్టర్ పట్టా అందుకోవాల్సిన జూనియర్ డాక్టర్ కు ఇంతటి ఘాతుకం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళా అయి ఉండి కూడా ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నా మహిళలపై అఘాయిత్యాల విషయానికి వస్తే బాధితులకు ఎలాంటి న్యాయం జరిగినట్టు దాఖలాలు లేవన్నారు. కొన్ని నెలలుగా సందేశ్‌ఖలీ, చోప్రా, ఇప్పుడు కోల్‌కతాలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతునప్పటికీ సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తోందన్నారు. బెంగాల్ ఘటనలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.