బిగ్ న్యూస్: T-బీజేపీ మరో భారీ ప్లాన్.. అధికారమే లక్ష్యంగా సంచలన నిర్ణయం

పార్టీ గుర్తును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరో ప్లాన్ చేసింది.

Update: 2023-03-28 03:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ గుర్తును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరో ప్లాన్ చేసింది. పార్టీ గుర్తును ప్రమోట్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలతో గ్రామీణ ప్రాంతాలకు రీచ్ అయింది. పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో మరింతగా జనాల్లోకి చొచ్చుకెళ్లింది.

ఇలా ఫస్ట్ ఫేజ్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో సక్సెస్ కాగా.. మరో దఫా అలాంటి సభలను నిర్వహించాలనే యోచనలో ఉంది. గత నెలలో 11 వేలకు పైగా సభలను కాషాయదళం నిర్వహించింది. ఆ విజయోత్సాహంతో రెండో విడత కూడా ఏర్పాటు చేసి మరోసారి ప్రజల్లోకి వెళ్లాని భావించింది. బీజేపీ సంస్థాగత కార్యదర్శి సునీల్ బన్సల్ కార్యాచరణను అమలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కమలనాథులు కసరత్తులో నిమగ్నమయ్యారు.

పార్టీ గుర్తును తీసుకెళ్లడమే టార్గెట్

పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీని తన పాదయాత్రలతో పల్లెల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. మరోవైపు స్ట్రీట్ కార్నర్ సభలు కూడా ఉపయోగపడ్డాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడమే టార్గెట్‌గా సెకండ్ ఫేజ్ స్ట్రీట్ కార్నర్ మీటింగులకు సిద్ధమవుతున్నారు. మే నెలలో నిర్వహించాలని చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి వారంలో లేదా చివరి వారంలో ఏర్పాటుచేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొదటిసారి 11 వేలకు పైగా సభలను నిర్వహించగా.. ఈసారి సంఖ్య మరింత పెంచాలని చూస్తున్నట్లు సమాచారం.

రిజర్వ్‌డ్ సెగ్మెంట్లపై ఫోకస్

యూపీ తరహాలో తెలంగాణలో కూడా స్ట్రీట్ కార్నర్ సభలపై మొదటగా సునీల్ బన్సల్ కార్యాచరణను సిద్ధం చేసిన సందర్భంగా సక్సెస్ అవుతాయో? లేదో అనే అనుమానం పార్టీ శ్రేణులు వ్యక్తంచేశాయి. 11 వేల సభలు నిర్వహించడమంటే మాటలా.. అని అవాక్కయ్యారు. కొన్నిచోట్ల నేతల మధ్య కొరవడిన సమన్వయంతో కొంత ఇబ్బంది ఎదురైనా.. ఆపై అంతా సెట్ అయింది.

టార్గెట్‌కు మించి సభలు నిర్వహించి జాతీయ నేతలతోనూ పార్టీ తెలంగాణ నేతలు శభాష్ అనిపించుకున్నారు. ఈ సక్సెస్‌తో మరోసారి నిర్వహించి గ్రౌండ్ లెవల్‌కు రీచ్ కావాలని భావించారు. ఫస్ట్ ఫేజ్‌లో ములుగు జిల్లాలో అధికంగా నిర్వహించారు. ఎస్టీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లపై దృష్టిసారించేందుకు మిషన్ 12 పేరుతో మీటింగ్ నిర్వహించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

ప్రధాని, ప్రెసిడెంట్ రాక

ఈనెల 31న సంగారెడ్డిలో జిల్లా పార్టీ ఆఫీసును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వచ్చే నెల 8న ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించేందుకు వస్తున్నారు. ప్రధాని ఆపై పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇలా తమ చూపంతా తెలంగాణపైనే ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నది. ప్రధాని మోడీ, జాతీయ నేతల రాకతో నేతల్లో జోష్ పెరిగి వారనుకున్న టార్గెట్‌ను బీజేపీ రీచ్ అవుతుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News