11 వేల సభలకు పక్కా ప్లాన్ రెడీ.. అధికారమే లక్ష్యంగా T- BJP భారీ వ్యూహం!
రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గ్రౌండ్ లెవల్‌లో బలోపేతం కావాలని కాషాయ పార్టీ బలంగా విశ్వసిస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గ్రౌండ్ లెవల్‌లో బలోపేతం కావాలని కాషాయ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అందుకోసం ఉత్తరప్రదేశ్ మోడల్‌ను ఇక్కడా ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ సభలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 రోజుల పాటు ఈ యాక్టివిటీని కొనసాగించాలని హైకమాండ్ ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా రోజుకు సగటున 733 మీటింగులు జరిగేలా ప్లాన్ చేసుకుంది. తొలుత 9 వేల సభలు నిర్వహించాలనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవి సరిపోవని ఆలోచించి 11 వేల సభలకు ప్లాన్ చేసుకుంది.
ఈ సభలకు ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొనాలనే అంశంపై క్లారిటీ వచ్చింది. ఎవరు ఏ నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా హాజరుకావాలనే అంశంపై రాష్ట్ర నాయకత్వం పూర్తి సమాచారాన్ని హైకమాండ్‌కు అప్రూవల్ కోసం పంపించింది. కాగా అన్ని సమీక్షించిన జాతీయ పార్టీ ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. వీధి సభల ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి చౌరస్తా రోడ్డునంబర్ 1 వద్ద నిర్వహించే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. ఆపై నియోకవర్గాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సనత్ నగర్‌లో తొలిరోజు వీధి సభలకు హాజరుకానున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్‌లో డీకే అరుణ, ఉప్పల్‌లో రఘునందన్ రావు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, జగిత్యాలలో ఎంపీ అర్వింద్, నారాయణఖేడ్‌కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, దుబ్బాకకు విజయశాంతి, మల్కాజ్ గిరికి కాసం వెంకటేశ్వర్లు, పరిగిలో ఏపీ జితేందర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేర్‌లో బూర నర్సయ్య గౌడ్ పాల్గొంటారు. తొలిరోజు ఈ సెగ్మెంట్లలో పాల్గొనే ముఖ్య నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీధి సభలకు హాజరుకావాల్సి ఉంది.
సొంత సెగ్మెంట్లలో నేతలు పట్టు సాధించేందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగులను బీజేపీ నిర్వహిస్తోంది. ఎలాంటి జనసమీకరణ చేపట్టకుండా ఉన్న కొద్దిమందితో అయినా సభ నిర్వహించాలని భావిస్తోంది. దీనివల్ల పార్టీకి ఎంతమేరకు ఆదరణ ఉందనేది తెలుసుకోవచ్చనేది బీజేపీ ఆలోచన. 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించాల్సిందేనని, అనుకున్న సమయంలో 11 వేల సభలు నిర్వహించాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది. అందుకే జనసమీకరణ చేపట్టకూడదని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పార్టీ ఎంత మేరకు బలంగా ఉంది, బలహీనంగా ఉంటే ఆ ప్రాంతంలో స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే నిర్ణయాలు తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడనుంది.
119 నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డ్స్, గ్రామ చౌరస్తా, జనసమూహం ఉండే ప్రదేశాల్లో బీజేపీ కార్నర్ మీటింగ్స్ కొనసాగనున్నాయి. వీధి సభల్లో ఏమేం మాట్లాడాలి.. అనే విషయమై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం 800 మంది స్పీకర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చింది. వారు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధుల వంటి అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలు, వారు హామీ ఇచ్చి మోసం చేసిన తీరును వివరించేలా స్ట్రీట్ కార్నర్ మీటింగులను ప్లాన్ చేసుకున్నారు. ఇంటింటికీ కరపత్రాలను కూడా పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా మెన్షన్ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలుపు కోసం ఇదే ఫార్ములాను వినియోగించుకున్న బీజేపీ తెలంగాణలోనూ దీన్నే ఆచరిస్తోంది.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రధానంగా మూడు అంశాలే ఎజెండాగా సాగనుంది. స్థానిక సమస్యలు తెలుసుకోవడం, వాటిపై ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల్లో భరోసా కల్పించాలని రూపొందించారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులనే కాకుకండా పార్టీ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వారు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విభాగాలకు చెందిన వారైతే ప్రజల్లోకి తీసుకెళ్లడం సులువుగా ఉంటుందని హైకమాండ్ విశ్వసిస్తోంది. అందుకే వారిని కూడా ఇందులో భాగం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కోఆర్డినేటర్ బాధ్యతలను ఏబీవీపీ నేత అయిన కాసం వెంకటేశ్వర్ రావుకు అప్పగించారు. ఓయూ కేంద్రంగా విద్యారంగ సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటాలు చేశారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడినా ఆయనకు సముచిత స్థానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కల్పించారు.
ఇవి కూడా చదవండి : నేడు తెలంగాణకు అమిత్ షా.. T- బీజేపీ ముఖ్య నేతలతో మీటింగ్!