BRS, కాంగ్రెస్‌లకు ‘కమలం’ ఫియర్! నష్టపోయే పార్టీ ఏదనే చర్చ
తెలంగాణలోని పదుల స్థానాల్లో బీజేపీ అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టించినట్లు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని పదుల స్థానాల్లో బీజేపీ అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టించినట్లు తెలుస్తున్నది. పలు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు సమాచారం. కమలం పార్టీ గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ తర్వాత బైపోల్స్‌లో మరో రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో డబుల్ డిజిట్ ను టచ్ చేసే అవకాశముందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత తమకు ప్లస్ కానుందని భావిస్తున్నారు. గులాబీ పార్టీకి సీట్లు తగ్గి.. తమకు పెరగవచ్చని పేర్కొంటున్నారు. 2018 ఎన్నికల్లో కాషాయ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా పోలైనవి సుమారు 14 లక్షల ఓట్లు. అయితే ఈ సారి ఓటు బ్యాంకు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్.
హంగ్‌పై ఆశలు
బీసీ సీఎం నినాదం, మోడీ రోడ్ షో, అగ్ర నేతల పర్యటనలు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నది. హంగ్ వస్తుందని భావిస్తున్న కమలం నేతలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతామని గంపెడాశలు పెట్టుకున్నారు. పోలింగ్ రోజు కేంద్రాల్లో యువత ఎక్కువ కనిపించిందని, ఆ ఓటు తమవైపే ఉందని బీజేపీ నేతలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. దళితుల్లో మెజారిటీ వర్గమైన మాదిగల ఓట్లు తమకే పోల్ అయినట్లు చెబుతున్నారు. అలాగే పసుపు బోర్డు అంశంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా తమకు లబ్ధి చేకూరుతుందని కమలం పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ ఫైట్.. ఆ పార్టీకి లబ్ధి చేకూర్చుతుందా? లేదా ఇతర పార్టీలకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది నేటితో తెరపడనుంది.
నష్టపోయేదెవరు?
హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్.. అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమాతో ఉన్నాయి. బీజేపీ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అయితే కమలం ఎవరి ఓటు బ్యాంకు, ఎవరి సీట్లకు గండికొడుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్లగా, మరికొన్ని చోట్ల బీజేపీకి వెళ్లినట్లు తెలుస్తున్నది.