Kishan Reddy: అభ్యర్థుల జాబితాలో మహిళలకు చోటేది?

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బంగారు కుటుంబ సభ్యులు దొంగ దీక్షలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు....

Update: 2023-08-21 17:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బంగారు కుటుంబ సభ్యులు దొంగ దీక్షలు చేశారని, కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహిళలకు చోటేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 33 శాతం అని చెప్పి 3+3 కలిపి 6 సీట్లే మహిళలకు కేటాయిస్తారని ఎద్దేవా చేశారు. ఇదేనా బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలని ఆయన ధ్వజమెత్తారు. ఇదేనా మహిళలకు చేయాలనుకున్న న్యాయమని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యేల జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు అర్థమైనట్లు ఉందని చురకలంటించారు. రోజురోజుకూ తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందన్నారు. అందుకే గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటుగా బీజేపీకి అన్నివర్గాల్లో పెరుగుతున్న గ్రాఫ్ కారణంగా కేసీఆర్‌లో నెలకొన్న భయానికి ఇది నిదర్శనంగా కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారని, మతోన్మాద మజ్లిస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలేందుకు ఆయా ప్రాంతాల్లో ఒవైసీ చెప్పిన అభ్యర్థులను బరిలో దించుతూ.. దోస్తుకు మద్దతుగా నిలుస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా.. కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఐదేళ్లుగా ఆ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో చేస్తున్న అవినీతి, అక్రమాలకు పచ్చజెండా ఊపినట్లుందని ఆయన ఎద్దేవాచేశారు. నిజాయితీగా పోటీచేస్తే ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి కనీసం అక్రమంగా సంపాదించిన డబ్బుతోనైనా ప్రయత్నించాలనేది కేసీఆర్ ఆలోచిస్తున్నట్లున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.

Tags:    

Similar News